33.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

పార్లమెంటులో దారి తప్పిన కాంగ్రెస్…

  • అదానీతో మొదలై.. అంబేద్కర్ దారిలోకి..
  • పార్లమెంటులో  డైవర్షన్ పాలిటిక్స్…
  • బిజేపి లక్ష్యం నెరవేరిందా?

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో  బీజేపి లక్ష్యం సాధించిందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. అదానీ పవర్ డీల్ పైనా, మణిపూర్ లో ఏడాదిగా రావణకాష్టంలా సాగుతున్న సమస్యపైనా ఏన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే వ్యూహంతో కాంగ్రెస్ ఈ సెషన్స్ కు హాజరైంది. మరోవైపు కీలకమైన జమిలి బిల్లును టేబుల్ చేసి సాధ్యమైనంత త్వరగా ఆ బిల్లును గట్టెక్కించాలనే ఉద్దేశంతో బీజేపి రంగంలో కి దిగింది. అయితే మొదటి రోజు నుంచీ అదానీ  ఎనర్జీ కంపెనీస్  అక్రమాలపై అమెరికా  ఆరోపణలకు బీజేపి ఏం సమాధానం చెబుతుందని సభను అడ్డుకున్నాయి కాంగ్రెస్, ఇతర విపక్షాలు.  దీనికి కౌంటర్ గా సోనియా, జార్జి సోరోస్ లింకులు బయటపెట్టాలంటూ  ఎన్డీఏ ఎదురు దాడి చేసింది.దాదాపు నాలుగైదు రోజులు  అదానీ అంశం, మణిపూర్ అంశం లేవనెత్తి కాంగ్రెస్ సభను సాగనీయకపోగా.. ఆందోళనలు, వాయిదాలతో  అడ్డుకుంది. రోజులు గడిచిపోయాయి.  ఇతర విపక్షాలు మోడీ తీరును తప్పుబట్టాయి.

ఫలించిన బీజేపి వ్యూహం?…

పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరో నాలుగు రోజుల్లో ముగుస్తున్నాయనగా  బీజేపి వ్యూహం మార్చింది.  జమిలి బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రవేశ పెట్టింది. దీనిపై తమ పార్టీనేతలకు విప్ జారీ చేసి మరీ బీజేపి రంగంలోకి  దిగింది. జమిలి బిల్లును  ఏకాభిప్రాయంతో గట్టెక్కించలేకపోయినప్పటికీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు  అనివార్యంగా దారి  తీసేలా బీజేపి పావులు కదిపింది. ఈవిషయంలో ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి.

 అదానీ నుంచి అంబేద్కర్ పైకి…

వాస్తవానికి అదానీ పై వచ్చిన ఆరోపణల అంశం ప్రస్తావిస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ఆ దిశగానే తమ వ్యూహం అమలుకు అడుగులేసింది… సభను అడ్డుకుంది. అయితే రాజ్యంగ రచనకు 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ దీనిపై చర్చను ప్రారంభించింది బీజేపి. ఇది పూర్తిగా డైవర్షన్ గేమే.. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ దాదా సాహెబ్ అంబేద్కర్ సేవలను ప్రస్తుతిస్తూ  విపక్షాలు సైతం చర్చల్లో పాల్గొన్నాయి. అంబేద్కర్ ను ఓన్ చేసుకుని, ఆశయాలను తామే కొనసాగించామని చెప్పుకునే క్రమంలో అన్ని పార్టీలు ఎవరి సత్తా మేరకు వారు ప్రస్తావించారు.  అంబేద్కర్ ను  తమ వాడిగా ముద్ర వేసుకున్న కాంగ్రెస్ బీజేపి తీరుపైనా రాజ్యాంగ సవరణలను ఇష్టారాజ్యం ప్రతిపాదిస్తున్న తీరుపైనా వ్యాఖ్యానించింది.

రచ్చకు దారి తీసిన అమిత్ షా  కామెంట్

విపక్షాల ఆరోపణలకు సమాధానిమిచ్చేందుకు రంగంలోకి దిగిన అమిత్ షా కాంగ్రెస్ పై చేసిన కామెంట్లు ప్రస్తుత రగడకు   కారణమయ్యాయి. అంబేద్కర్ పేరు వందల సార్లు తలవడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయిందని,  కాంగ్రెస్ నేతలు  అందుకు బదులు దేవుడి పేరు  తలచినా.. వారికి స్వర్గంలో చోటయినా దక్కేదని, చేసిన పాపాల ను కడుగుక్కన్నట్లయ్యేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒక్క కామెంట్ తో  సభ లో సీన్ మొత్తం మారిపోయింది. అమిత్ షా కామెంట్లపై కాంగ్రెస్ మండి పడింది. హోం మంత్రి తక్షణం రాజీనామా చేయాలని, రాజ్యాంగ నిర్మాతను నిండు సభ సాక్షిగా అవమానించారంటూ  కాంగ్రెస్ తో సహా ఇతర విపక్షాలు సభను అడ్డుకున్నాయి.

షాకు అండగా మోడీ

అమిత్ షాకు మద్దతుగా రంగంలోకి దిగిన మోడీ అంబేద్కర్ పై కపట ప్రేమ వారిదని, ఆయనకు వెన్ను పోటు పొడిచి ఎన్నికల్లో ఓడించిన ఘనులు మీరేనంటూ  విమర్శించారు.  ఆయనకు భారత రత్న కూడా ఇవ్వలేదని ఎండగట్టారు. నెహ్రూ అంబేద్కర్ కు చేసిన ద్రోహం గురించి  ముందు మాట్లాడండి అంటూ దూకుడు పెంచారు.కుటుంబ పాలనతో.. సుదీర్ఘ కాలం దేశాన్నేలి అంబేద్కర్ ఆశయాలను ఒక్కొక్కటిగా భగ్నం చేసి ఎస్సీ, ఎస్టీలను ఘోరంగా అవమానించారని విమర్శించారు. మోడీ  కామెంట్లకు మరింత రెచ్చిపోయిన కాంగ్రెస్ నేతలు అమిత్ షా సభకు క్షమాపణ చెప్పి , రాజీనామా చేయాలంటూ  ఆందోళన చేశారు. అంతేకాదు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు నిచ్చారు.  మరో వైపు రాజ్యసభ లో కూడా ఇదే వార్ కొనసాగింది. జమిలి బిల్లును చేర్చాల్సిన చోటుకు  చేర్చి… అంటే జేపీసీకి బదలాయించేలా చేసుకున్న  బీజేపి  అంబేద్కర్  పై  తాజా రగడతో  కౌంటర్ వ్యూహంతో ముందు కెళుతోంది.

పోస్టర్ల  వార్

అమిత్ షా వ్యాఖ్యలపై పార్లమెంట్ ప్రాంగణంలో అంబేద్కర్ ఫోటోలతో కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు  చేస్తుంటే బీజేపి దానికి కౌంటర్ ఎత్తుగడ వేసింది. వారి ఫోటోను మార్ఫ్ చేసి దూకుడు పెంచింది.  వారి పోస్టర్లలో అంబేద్కర్  ఫొటో స్థానంలో జార్జి సోరోస్ ఫోటోను ఎడిట్ చేసి  పెట్టి.. ఆపై వెనకాల వియ్ లవ్ సోరోస్ అనే కామెంట్ రాసి  ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలకు చర్చకు అజెండా సెట్ చేశాం రండి అంటూ ఆ  ట్వీట్ లో పేర్కొంది.  బీజేపి ఈ చర్యపై  కాంగ్రెస్ఎంపీ ప్రియాంకా గాంధీ మండి పడ్డారు. అంబేద్కర్ మహోన్నత వ్యక్తిత్వాన్ని మంటగలిపే ఇలాంటి మార్ఫింగ్ ఎత్తుగడలు అవలంబించే వారిని ఎవరు నమ్ముతారు? వారిపై ఎవరికి నమ్మకం ఉంటుందంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగం మార్చబోం అంటారు.. రిజర్వేషన్లు ఎత్తేయం అంటారు.. చేసేది మాత్రం చేస్తూనే ఉంటారు. రాజ్యాంగ స్రుష్టికర్త పై వారి చిత్తశుద్ధి ఏంటో ఇట్టే బయటపడింది అన్నారు.ఫోటోలను ఎడిట్ చేయడం, మార్ఫింగ్ చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

ఎవరి దుకాణం వారిదే…

ఈ సమావేశాల్లో మొదటి నుంచి ఇండియా కూటమిలో విభేదాలు కనిపిస్తూనే ఉన్నాయి.  సభలో బీజేపి ఈ కూటమిని ఎద్దేవా చేస్తూ  విమర్శలు చేసింది కూడా. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి విపక్షాలన్నీ కూటమి కట్టినప్పుడు ఐక్యంగా పోరాడి ఉంటే ఫలితముండేది. ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ ఒకవైపు, త్రుణమూల్ మరోవైపు కూటమిని లాగుతున్నాయి. కూటమిలో సభ్యులంతా ఎవరి దారి వారిదే అన్నట్లే ఉన్నారు. సభలో  రచ్చ జరుగుతుంటే ఇండియా కూటమి నేతగా తనను ఉండమంటే రెడీ అంటూ మమతా బెనర్జీ ఫీలర్స్ వదిలారు. ఇది అనైక్యతకు పెద్ద  చిహ్నం.. చివరకు అంబేద్కర్ పై పోరాటంలోనూ అం దరూ కలసి పాల్గొనక పోగా ఎవరి దుకాణం వారిదే అన్నట్లు  సొంత కుంపట్లతో  నిరసనలు మొదలు పెట్టారు. అంబేద్కర్ ను ఓన్ చేసుకోడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com