తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోందని, ఊహించని రీతిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అవసరాలను తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు సంస్కరణలు చేపట్టి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖా మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో విద్యుత్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు వివరాలు వెల్లడించారు.
2021 నాటికి 13,668 మెగావాట్ల పిక్ డిమాండ్ ఉండగా 2021-22 నాటికి 14,160 మెగావాట్ల పీక్ డిమాండ్‌కు చేరుకుందని, 2022-23 నాటికి 15,497 మెగావాట్ల పిక్ డిమాండ్‌కు పెరిగిందన్నారు. ఈ సంవత్సరం మార్చి నెలలో 17,162 మెగావాట్ల పిక్ డిమాండ్‌కు పెరిగినప్పటికీ ముందస్తుగా తీసుకున్న చర్యలు, సంస్కరణల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా, కరెంటు ట్రిప్పు కాకుండా, కరెంటు కట్ లేకుండా, నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని విద్యుత్తు లబ్ధిదారులకు 24/7 నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి కృషి చేస్తున్న విద్యుత్తు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య క్లస్టర్స్ ఏర్పాటు, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, హైటెక్ సిటీ పరిధిలో విస్తరిస్తున్న ఐటీ సెక్టర్, రాష్ట్రానికి కొత్తగా వస్తున్న డేటా సెంటర్స్ ఏర్పాటుతో భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు మరింత పెరుగనున్నాయన్నారు. 2029-30 నాటికి గరిష్ట డిమాండ్ 24,215 మెగావాట్లు, 2034-35 నాటికి 31,809 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉంటుందని కేంద్రం నుంచి వచ్చిన అంచనాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్ మిషన్, డిస్కంల బలోపేతానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు.
రాజస్థాన్‌లో విద్యుత్ శక్తి ఉత్పత్తికి సింగరేణి ఆధ్వర్యంలో సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నామన్నారు. హైడల్ పవర్ ఉత్పత్తి చేయడానికి మరో పొరుగు రాష్ట్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నదన్నారు. 2021 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రావాల్సి ఉండగా పర్యావరణ అనుమతులు రాకపోవడంతో అనుకున్న సమయం నాటికి ఉత్పత్తి రాలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే పర్యావరణ అనుమతుల కోసం అక్కడి కలెక్టర్ ద్వారా పబ్లిక్ హియరింగ్ తీసుకొని పర్యావరణ అనుమతులు తెచ్చి యూనిట్ 2 ప్రారంభించి ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వై టి పి ఎస్ కు సింగరేణి నుంచి బొగ్గు రవాణా చేయడానికి కావలసిన వ్యవస్థ కూడా లేకపోవడంతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాలెండర్ ఫిక్స్ చేసి ప్రతి వారం సమీక్ష చేసి రైల్వే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి బొగ్గు సరఫరా చేసే రైలు ప్రారంభించామన్నారు. పీక్ అవర్‌లో జల విద్యుత్‌ను పెంచుకోవడానికి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టి రాష్ట్రానికి కావలసిన విద్యుత్ అవసరాలు తీర్చుతున్నామన్నారు. శంకర్‌పల్లి లో బ్యాటరీ విద్యుత్ నిలువలు పెంచడానికి టెండర్లు పిలిచామని చెప్పారు. 500 మెగావాట్లు బ్యాటరీ విద్యుత్ ఉత్పత్తి నిలువలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తట్టుకునే విధంగా ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్ లను బలోపేతం చేశామని, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ను అభివృద్ధి చేసుకోవడం వల్లనే ప్రస్తుతం ట్రిప్ కాకుండా కరెంటును నిరంతరంగా సరఫరా చేస్తున్నామన్నారు.
ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ జెన్కో ట్రాన్స్కో అధికారులతో సమీక్ష చేసి సమ్మర్ యాక్షన్ ప్లాన్ ముందస్తుగా తయారు చేసుకుని ముందుకు వెళ్లడం వలన ఇప్పుడు పెరిగిన పీక్ డిమాండ్‌ను తట్టుకున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ, ఉచిత కరెంటుకు సంబంధించిన డబ్బులను ప్రతినెల డిస్కమ్‌లకు చెల్లించి వాటిని బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఒక కోటి 94 లక్షల 61వేల 511 విద్యుత్ కనెక్షన్లు ఉండగా 29 లక్షల 14 వేల 692 వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా అందిస్తున్న కరెంటుకు సంబంధించి 11,500 కోట్ల రూపాయలను డిస్కములకు చెల్లించామన్నారు. గత సంవత్సరం మార్చి నుంచి ప్రారంభించిన గృహ జ్యోతి పథకంలో 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, వీరికి ఉచితంగా ఇస్తున్న కరెంటుకు ఇప్పటి వరకు డిస్కం సంస్థలకు 1,922.31 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ చెల్లించిందన్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి న్యూ ఎనర్జీ పాలసీని ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. 2030 నాటికి 20వేల మెగావాట్లు, 2035 నాటికి 40 వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి పెంచాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడం వల్ల రాష్ట్రానికి లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి వివిధ సంస్థలు మన ప్రభుత్వంతో ఎం ఓ యు చేసుకున్నాయని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేకుండా 20,000 కోట్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా 21 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చామన్నారు. ఈ డబ్బులను వ్యాపారంలో పెట్టడానికి ప్రభుత్వమే వారికి మార్గం చూపిస్తున్నదన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సెర్ఫ్- ఎనర్జీ శాఖల మధ్యన ఎంఓయూ చేశామన్నారు. మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావలసిన సహకారం అందించి వారు ఉత్పత్తి చేసిన కరెంటును ప్రభుత్వమే కొనుగోలు చేసి వచ్చిన లాభాలతో మహిళలు ఆర్థికంగా నిలుదొక్కుకోవడానికి వ్యవస్థను ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలోని రైతులకు పంటతో పాటు పవర్‌తో కూడా ఆదాయం రావాలని వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ఏర్పాటు చేస్తున్నామని, గత ప్రభుత్వం కుసుం పథకాన్ని వాడుకోకుండా నిర్లక్ష్యం చేసి విస్మరించగా మేము అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి పెద్దఎత్తున ఈ పథకం వాడుకోవాలని ముందుకు వెళ్తున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద ఉన్న ఖాళీ స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి, వాటర్ బాడీలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి, సింగరేణి బొగ్గు బావుల్లో పంపుడ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కార్యచరణ ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతున్నదన్నారు.
పోడు సాగు చేసుకుంటున్న గిరిజన సోదరులకు ఇందిరా గిరి వికాసం పథకం అమలు చేయడానికి ఈ బడ్జెట్ లో 12,500 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకోవడానికి వారి వ్యవసాయ మోటార్లకు సోలార్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. డ్రిప్స్, స్ప్లింకర్స్ ఇచ్చి హార్టికల్చరల్ పంటలు సాగు చేయడానికి ప్రోత్సహిస్తామని చెప్పారు.
ప్రభుత్వ, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురి కాకుండా వాటిపైన రూప్ సోలార్ ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తున్నామన్నారు. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురావడం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు.
జిహెచ్ఎంసి పరిధిలో 132 ఎలక్ట్రిసిటీ అంబులెన్స్లను తీసుకువచ్చామన్నారు. వివిధ కారణాల వల్ల ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడిన 1912 కు కాల్ చేసిన వెంటనే అక్కడికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసి కరెంటు సరఫరా కు చర్యలు తీసుకుంటారని, ఈ వ్యవస్థను రాష్ట్ర మొత్తం త్వరలోనే విస్తరిస్తామని చెప్పారు. వినియోగదారులు విద్యుత్ సేవలు సులభతరంగా పొందడానికి కన్జ్యూమర్ యాప్, వెబ్సైట్ను ప్రారంభిస్తామని చెప్పారు. విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తూనే ఉద్యోగులను కూడా పెంచుతున్నామన్నారు. విద్యుత్ సంస్థల్లో దశాబ్ద కాలంగా పదోన్నతులు లేకుండా నిరీక్షించిన 5100 మంది ఉద్యోగులకు మేము అధికారంలోకి రాగానే పదోన్నతులు ఇచ్చి ప్రోత్సహించామని, 672 మందిని కొత్తగా నియామకం చేసుకున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలను బలోపేతం చేసుకొని నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేస్తున్నందున దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సంస్థలు, ప్రఖ్యాతి చెందిన ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు.
జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఎల్డీసీ ఎక్సలెంట్ 2024 అవార్డును టీజీ ట్రాన్స్ కో
ఈసంవత్సరం కైవసం చేసుకున్నదన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇండ్లపై నుంచి వెళ్లిన విద్యుత్తు లైనుల వల్ల బట్టలు ఆరేయడానికి బిల్డింగ్ పైకి వెళ్ళిన వారికి కరెంటు తీగలు తగిలి ప్రమాదానికి గురవుతున్నారని చాలా మంది లైన్లను మార్చాలని వినతులు ఇస్తున్నారని, ఈ సమస్య పరిష్కరించడానికి ఈ సంవత్సరం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను గుర్తించి ఇండ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్ ను మార్చడానికి ప్రభుత్వమే నిధులను వెచ్చిస్తున్నదన్నారు.
సామాజిక బాధ్యతగా ప్రజా ప్రభుత్వం కొన్ని వర్గాలకు అందిస్తున్న సబ్సిడీ విద్యుత్తుకు సంబంధించిన డబ్బులను లెక్క కట్టి ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నదని, రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్స్, పౌల్ట్రీ ఫార్మ్, సెలూన్ షాపులకు, ఇస్త్రీ షాపులకు, గణేష్ మండపాలకు సరఫరా చేస్తున్న విద్యుత్తు సంబంధించిన డబ్బులను లెక్క కట్టి ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ సంస్థలకు చెల్లించామని వివరించారు.