37.2 C
Hyderabad
Tuesday, May 26, 2026

Live Video

spot_img

హిందూ మహాసముద్రంలో చైనా గూఢచారి నౌక

ఆపరేషన్ సిందూర్ తర్వాత హిందూ మహాసముద్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు నిర్వహించిన దాడుల తర్వాత, చైనా గూఢచారి నౌక ‘డ యాంగ్ యి హావో’ భారత జలాల సమీపంలో సంచరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిణామం పాకిస్థాన్‌కు చైనా సంపూర్ణ మద్దతుగా భావించవచ్చని, ఇదంతా ఒక వ్యూహాత్మక ప్రయత్నంగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. భారత నౌకాదళ కదలికలు, జలాంతర్గాముల ప్రస్థానం, నిఘా వ్యవస్థల పనితీరు వంటి కీలక అంశాలను పసిగట్టడమే లక్ష్యంగా చైనా ఈ నౌకను మోహరించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ పరికరాలు, సెన్సర్లతో కూడిన ఈ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సహా ఇతర భారత యుద్ధ నౌకల కదలికలపై నిఘా పెట్టగల సామర్థ్యం కలిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత నౌకాదళం అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ఉత్తర భాగంలో అప్రమత్తంగా మోహరించగా, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములు రంగంలోకి దిగాయి. చైనా పాకిస్థాన్‌కు మద్దతుగా మాత్రమే కాక, కీలక నిఘా సమాచారాన్ని సేకరించి పాక్‌కు ముందుగానే అందించేందుకు ఈ నౌకను పంపిందన్న అభిప్రాయం బలపడుతోంది. భారత దాడులు జరిగే అవకాశం ఉన్న కరాచీ వంటి ప్రాంతాలపైనా వ్యూహాత్మక సమాచారాన్ని పాక్‌కు చేరవేసే యత్నంగా ఇది అనిపిస్తోంది.

మరోవైపు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషయేటివ్‌లో భాగమైన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) నిర్మాణం పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా కొనసాగుతున్న నేపథ్యంలో, అక్కడ రాజకీయ, భద్రతా స్థిరత్వం చైనాకు ఎంతగానో అవసరం. ఈ కారణంగా కూడా చైనా నిఘా కార్యకలాపాలకు దిగి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నౌక కేవలం నిఘాకే పరిమితం కాకుండా, భారత నౌకాదళ కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే సామర్థ్యం కలిగి ఉందని, సబ్‌మెరైన్‌ల కదలికల మ్యాపింగ్ ద్వారా భవిష్యత్తులో పాక్‌లో ఏర్పాటు చేయాలనుకునే సైనిక లాజిస్టిక్స్ స్థావరానికి ఈ సమాచారం ఉపయోగపడవచ్చని అంచనాలు ఉన్నాయి. చైనా నౌకల కదలికలు హిందూ మహాసముద్రంలో ఇదే మొదటిసారి కాదు. 2024లో ‘యువాన్ వాంగ్-6’ నౌకను కూడా చైనా మోహరించింది. భారత ఆధిపత్యాన్ని సవాలు చేయాలన్నదే చైనా అసలు ఉద్దేశ్యమని తాజా పరిణామాల నేపథ్యంలో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com