చైనాలో పుట్టిన మరో కొత్త వైరస్ హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేసింది. ప్రత్యేకంగా హెల్త్ అలర్ట్ నోటీస్ జారీచేసింది. చైనాలో ఇప్పటికే ఆసుపత్రులు, శ్మశానాలన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యాయి. ప్రజలకు పలు సూచనలు చేశాయి.
ప్రస్తుతం తెలంగాణలో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్‌కి సంబంధించిన ఎటువంటి కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డిసెంబర్ 2024లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల డేటాను విశ్లేషించగా, 2023తో పోల్చితే గణనీయమైన పెరుగుదల కనిపించలేదని పేర్కొంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, ఈ శ్వాస కోశ ఇన్ఫెక్షన్లను నివారించేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.
బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఏం చేయవచ్చో, ఏం చేయకూడదో అన్న జాగ్రత్తలు వెల్లడించింది. దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు నోటిని, ముక్కుకు రుమాలు లేదా టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకోవాలని సూచించింది. అలాగే, సబ్బుతో లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో తరచుగా చేతులు కడగాలని, గుంపులు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, జ్వరం, దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు ఉంటే, బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం నివారించాలని ప్రభుత్వం సూచించింది. అలాగే, ఎక్కువగా నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం అవసరమని, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు గదులు బాగా గాలి పీల్చుకునేలా చూసుకోవాలని, అస్వస్థత కలిగితే ఇంట్లోనే ఉండి ఇతరులతో కలవడం తగ్గించాలని సలహా ఇచ్చింది. అలాగే నిద్ర తక్కువ కాకుండా చూసుకోవాలని కూడా సూచించింది.
ఇక, ప్రజలు ఈ వైరస్ బారిన పడకుండా చేయకూడనివేంటో కూడా ప్రకటించింది. ఎదుటివాళ్లతో చేతులు కలపడం తగ్గించాలని, టిష్యూ పేపర్ లేదా రుమాలును తిరిగి మళ్లీ మళ్లీ ఉపయోగించొద్దని సూచించింది. అలాగే, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో ఎక్కువగా సన్నిహితంగా ఉండకూడదని, కళ్లను, ముక్కును, నోటిని తరచూ తాకకూడదని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం చేయరాదని, డాక్టర్ సలహా లేకుండా మందులు వినియోగించకూడదని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేసింది.