ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు వడ్లమాను గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా కులవృత్తులు చేసుకునేవారి ఇళ్లకు వెళ్లి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు సీఎం. బీసీ సామాజిక వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఆయనకు చెందిన పశువుల పాకను పరిశీలించారు. ఆ తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన బత్తుల జగన్నాథం క్షౌరశాలను చంద్రబాబు పరిశీలించారు. ఆయనతో పాటు.. ఆయన కుమారుడితో కొద్దిసేపు ముచ్చటించారు. జగన్నాథం ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక పరికరాలతో కూడిన కిట్‌ను సీఎం ఆయనకు బహూకరించారు.
అనంతరం ఆగిరిపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులోని ప్రజావేదిక వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లారు. మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో యాదవ సంఘం నేతలు ముఖ్యమంత్రికి గొర్రె పిల్లను బహూకరించారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రులు పార్థసారథి. సవిత, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.