సై అంటే సై అంటోంది చైనా. అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ వార్‌లో వెనక్కి తగ్గేదేలే అని చెబుతోంది. ఇప్పటికే తమపై 145 శాతం టారిఫ్‌లు విధించిన అమెరికాకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. అమెరికాపై ఏకంగా 125 శాతం టారిఫ్‌లు విధించింది చైనా. అంతేకాదు ఈ టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రీసెంట్‌గా తాము చైనీయులం.. ఎవరికి భయపడమని స్టేట్‌మెంట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే 84 శాతం నుంచి 125 శాతానికి టారిఫ్‌లు పెంచుతూ అమెరికాకు షాక్ ఇచ్చింది.
చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రేడ్ వార్ పీక్స్‌కు చేరినట్టే అని చెప్పాలి. కేవలం టారిఫ్‌లు పెంచడమే కాదు.. మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇకపై అమెరికా ఎంత టారిఫ్‌లు పెంచినా తాము మాత్రం ఇక పెంచేది లేదంది. టారిఫ్‌ల పెంపులో ఇదే చివరిదని తెలిపింది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయనకు కామన్ సెన్స్ అనేదే లేదని అంతర్జాతీయ ఆర్థిక చట్టాలపై కనీస అవగాహన కూడా లేదంటూ ఫైర్ అయ్యింది. ట్రంప్ కారణంగానే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడింది.
ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. తమపై ప్రతీకార టారిఫ్‌లు విధించారన్న సాకును చూపి చైనాపై టారిఫ్‌లను కొనసాగిస్తున్నారు. ఇక ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లను మాత్రం 90 రోజుల పాటు నిలిపివేసింది.