-
కాళేశ్వరం కడితే మేం అడ్డుకున్నమా?
-
బనకచర్ల నిర్మిస్తామంటున్న ఏపీ సీఎం చంద్రబాబు
-
తెలంగాణలో తీవ్ర ఆగ్రహావేశాలు
ఏపీ సీఎం చంద్రబాబు మరో వివాదానికి తెర లేపారు. మరో ప్రాజెక్టు తేనెతుట్టెను కదిపారు. బనకచర్ల నిర్మిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అడ్డుకున్నామా? అని అంటున్నారు. ఇప్పుడీ అంశం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపేలా కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సభలో మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం కట్టుకుంటే మేం అడ్డుకున్నామా? గోదావరి వృథా జలాల ఆధారంగా బనకచర్ల కట్టుకుంటే తప్పేమిటి?’ అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. జలరంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అసలు గోదావరి బేసిన్‌లో ఉన్నవి మిగులు జలాలేనని, వరదజలాలు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో గోదావరి ట్రిబ్యునల్ చెప్పిన విషయాలను ఉటంకిస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ బనకచర్లపై ముందుకెళ్తున్నారని ఆక్షేపిస్తున్నారు.
ఒకవేళ, ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిర్మించాలనుకుంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జలరంగ, న్యాయ నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించి పర్మిషన్ వచ్చిన తర్వాతే ముందుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. కేటాయింపుల్లేని వరద జలాలను సాకుగా చూపి మన నీళ్లను తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం కట్టుకుంటే తాము అడ్డుకోలేదంటూ అక్కసు వెళ్లగక్కారని తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు.
చంద్రబాబు ఆలోచనలపై తెలంగాణ సర్కారు ఉదాసీనంగా వ్యవహరించవద్దని, వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పొతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు తెలంగాణ ప్రజలు నీళ్లకోసం అల్లాడే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.