ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య కాల్పుల విరమణకు డీల్ కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. తాను ఇజ్రాయెల్-లెబనాన్ ప్రధానులతో మాట్లాడాను.. అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇరువురు అంగీకరించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం అంటూ బైడెన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ డీల్‌ను అమోదిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా అంగీకరించారు. అయితే ఈ ఒప్పందం ఎన్ని రోజులు అమల్లో ఉంటుందనేది లెబనాన్ తీరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మాత్రం ఘాటుగా స్పందిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు కొన్ని కారణాలను కూడా చెప్పారు నెతన్యాహు. తమ సైనికుల సంక్షేమం ఒకటైతే.. హమాస్‌ను ఒంటరిదాన్ని చేయడం మరో కారణమన్నారు.
ఈ ఒప్పందం వెనక అమెరికా కీలకపాత్ర పోషించింది. ఒప్పందం ప్రకారం 60 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉండగా.. లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుందన్నారు. రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు అమెరికా, టర్కీ, ఈజిప్టు, ఖతార్ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామని బైడెన్ వివరించారు.
ఒప్పందం వెనక అసలు కారణాలు వేరే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరికొన్ని రోజుల్‌లో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ టైమ్‌లోనే తన పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే లెబనాన్ సైన్యంతో ఇజ్రాయెల్ యుద్ధం చేయడం లేదు. ఇజ్రాయెల్ పోరాడేది హెజ్బుల్లా అనే మిలిటెంట్ సంస్థతో. కానీ అమెరికా ఈ డీల్ కుదిర్చింది ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య. ఇంత హడావుడిగా ఈ ఒప్పందం ఎలా కుదిరిందన్నది మరో ప్రశ్న. అంతేకాదు ఇజ్రాయెల్ కూడా ఈ డీల్‌కు అంగీకరించడం వెనక అమెరికా ఒత్తిడి ఉన్నట్టు క్లియర్ కట్‌గా తెలుస్తోంది. ఎందుకంటే నెతన్యాహు మాట్లాడుతూ ఆయుధాల సరఫరా అంశాన్ని ప్రస్తావించారు. అంటే అమెరికా ఆయుధాల సరఫరా నిలిపివేస్తామని ఏమైనా వార్నింగ్ ఇచ్చిందా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
ఇక బైడెన్ చేసిన మరోపని ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ మిసైల్స్‌ను ఉపయోగించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. దీనికి సంబంధించి బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు బైడెన్. దీంతో రష్యాపై దాడుల తీవ్రతను పెంచింది ఉక్రెయిన్. రష్యా దీనికి గట్టిగా బదులిస్తే ఈ యుద్ధాన్ని ఆపడం ఎవరి తరం కాదనే చెప్పాలి. వెళ్తూ వెళ్తూ రగులుతున్న మంటల్లో మరింత పెట్రోల్ పోసినట్టే ఉంది బైడెన్ చర్య. తాను అధికారంలోకి వచ్చాక వీలైనంత త్వరలో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. కానీ బైడెన్ పెట్టిన చిచ్చు కారణంగా అదేమవుతుందో చూడాలి.