నెల్లూరులో తెలుగుదేశం పార్టీ అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. వైసీపీ గుర్తుతో, జగన్ చరిష్మాతో గెలిచిన వైసీపీ కార్పొరేటర్లతో టీడీపీ నుంచి డిప్యూటీమేయర్ అభ్యర్థిని గెలిపించుకోవడం అంటేనే.. టీడీపీకి పతనం ప్రారంభమైందన్నారు.అసలు నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేసే కనీస అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన విమర్శించారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు పార్టీ సింబల్ మీద గెలుపొందారని చెప్పారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ తిరుగులేని శక్తిగా ఉందన్నారు. అప్పుడు.. వైసీపీ పార్టీ నుంచి జగన్ మోహన్‌రెడ్డి బీఫామ్ ఇచ్చి.. జగన్ ఆశీస్సులతో ప్రజలదగ్గరికి పంపిస్తే.. అప్పటి జగన్ పరిపాలనా తీరు, సంక్షేమ పథకాల అమలు తీరును చూసి వైసీపీ అభ్యర్థులకు జనం ఓటు వేశారన్నారు.
అయితే, ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్న నారాయణ బెదిరింపులకు పాల్పడి, భయపెట్టి.. వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచిన కొందరిని టీడీపీలో చేర్చుకున్నారని విమర్శించారు. ఇది చాలా దురదృష్టకర, దుర్మార్గమైన చర్య అన్నారు. అయితే, వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు తమ అంతరాత్మకు సమాధానం చెప్పుకొని.. వైసీపీ అభ్యర్థినే డిప్యూటీ మేయర్‌గా గెలిపించాలని కాకాణి గోవర్థన్‌రెడ్డి సూచించారు. ఈ కీలక సమయంలో వైసీపీకి అండగా నిలబడతారని ఆశిస్తున్నామన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిస్థితులను అధిష్టానానికి వివరిస్తామని, పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామన్నారు. ఈమేరకు పార్టీ అధినేత జగన్ తీసుకునే నిర్ణయానికి ఆమోదం తెలపాలని ఇవాల్టి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గుర్తుపై గెలిచిన వాళ్లతో టీడీపీ వాళ్లు అభ్యర్థుని నిలబెట్టి గెలిపించుకోవడం అంటే.. అంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టకరం ఇంకోటి ఉండదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ మీద ఆధారపడి బతకాలన్న పరిస్తితులు మీకు వచ్చాయంటేనే తెలుగుదేశంపార్టీ పతనం ప్రారంభమైందన్నారు. అక్రమంగా తమ పార్టీ కార్పొరేటర్లను మభ్యపెట్టి, భయపెట్టి టీడీపీలో చేర్చుకొని వాళ్లద్వారా గెలిపించుకునే డిప్యూటీ మేయర్ గెలుపు.. గెలుపు అనిపించుకుంటుందా? అని ప్రశ్నించారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇప్పటికీ నిజమైన వైసీపీ నాయకులు, కార్యకర్తలందరిలో ఫైటింగ్ స్పిరిట్ ఉందన్నారు. వైసీపీ నుంచి గెలిచి.. టీడీపీకి ఓటు వేస్తే.. న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తామన్నారు. డిప్యూటీ మేయర్ కు పోటీపై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు.