- క్యాబినెట్ విస్తరణ పై మళ్లీ ఊహాగానాలు
- పోటీలో 12 మంది… ఆరుగురికే అవకాశం
- ఢిల్లీకి రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క
- రెండు రోజులపాటు అధిష్టానంతో చర్చలు
- ఈసారి విస్తరణ పక్కా అంటున్న నేతలు
తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారు అయింది. ఉగాది నాటికి విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు. గత ఏడాదిన్నరగా విస్తరణకు సంబంధించి అనేక ఊహగానాలు వినిపించినప్పటికీ తాజాగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. క్యాబినేట్ విస్తరణతో పాటు ఇతర పదవులు… నామినేటెడ్ పోస్టుల భర్తీపై కీలక సమావేశం ఢిల్లీలో జరగనుంది. సోమవారం సాయంత్రం నుంచి రెండు రోజులపాటు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదే విధంగా భట్టి విక్రమార్కకు సమాచారం ఇచ్చినట్లుగా తెలిసింది.
ముఖ్యమంత్రితో కలిపి ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ సంఖ్య 11 .. మరో ఆరుగురికి క్యాబినెట్లో అవకాశం ఉంది. అయితే ఈ ఆరు మంత్రి పదవులకు సుమారు 12 మంది వరకు ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాఉ చెపుతున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు క్యాబినెట్ విస్తరణలో ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.
నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది.. నిజామాబాద్ లో ఉన్న రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని సీనియర్ ఎమ్మెల్యే కావడం చేత సుదర్శన్ రెడ్డి వైపే అధిష్టానం ముగ్గు చూపే అవకాశం ఉందని తెలిసింది.
నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీలో బలంగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం బిజెపి నుంచి కాంగ్రెస్లో చేరుతున్న సమయంలో అధిష్టానం ఆయనకు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. భువనగిరి పార్లమెంటు ఎలక్షన్లో కూడా ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల మాట్లాడుతూ కోమటిరెడ్డి మంత్రివర్గంలో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం ఆశిస్తున్న మరో నేత మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. బీసీల రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు పేరు చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ కూడా తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం దగ్గర ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికొస్తే పెద్దగా నాయకుల పోటీ లేనప్పటికీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలుపొందిన ఏకైక కాంగ్రెస్ శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఒక్కరే కావడం విశేషం. ఇటీవల అసెంబ్లీలో ఆయన చిట్ చాట్ చేసినప్పుడు కూడా తనకు కచ్చితంగా మంత్రిగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు..
తాజాగా ఎమ్మెల్సీల నుంచి కూడా కొందరు మంత్రులు కావాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సినీ నటి విజయశాంతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మద్దతు ఆమెకు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వేదికల మీద ఆకర్షణీయ ప్రసంగం చేయగల మహిళా నేతలు లేరని ప్రస్తుతం మంత్రులగా ఉన్న సీతక్క కానీ కొండా సురేఖ కానీ పబ్లిక్ స్పీచుల్లో చాలా వీక్ అనే అభిప్రాయానికి మీనాక్షీ నటరాజన్ వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని అధిష్టానం వద్ద చెప్పి, ప్రజాకర్షక మహిళానేత కొతర తెలంగాణ కాంగ్రెస్ కు తీర్చాలంటే విజయశాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని ఒప్పించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇక మంత్రి మండలిలోకి తీసుకోవడం లాంఛనమే అంటున్నాయి ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు.
అలాగే రేంవత్ రెడ్డి క్యాబినేట్ లో మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం లేదు. తెలంగాణలో ప్రిడామినెంట్ క్యాస్ట్ అయిన మున్నూరు కాపులకు ఈ సారి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి తనకు అవకాశం ఇవ్వాలని దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ అడుగుతున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారు క్యాబినెట్లో లేరని గుర్తు చేస్తున్నారు. వీరితోపాటు మరికొంత మంది పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నప్పటికీ అధిష్టానం చేతిలో మాత్రం వీరి పేర్లే ఉన్నట్లుగా తెలిసింది.
ఇదిలా ఉండగా ప్రస్తుత క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగినా… ఇప్పటికిప్పుడు దీనిపై అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రానట్లుగా తెలిసింది. మంత్రివర్గం నుంచి తొలగించాల్సి వస్తే కొండ సురేఖతో పాటు జూపల్లి కృష్ణారావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే మారిన సమీకరణాలు ఇతర కారణాల చేత ప్రస్తుతం క్యాబినెట్ లో నుంచి ఎవరిని తొలగించే అవకాశం లేనట్లుగా తెలిసింది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సీఎం ఢిల్లీకి వెళ్తున్నారన్న ప్రచారంతో ఆశావాహులంతా ఈ ఉదయం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే గతంలో కూడా ఇలాంటి ప్రచారాలు చాలా జరిగాయి. వివిధ కారణాల చేత అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈసారి మాత్రం ఉగాదికి ముందే పక్కాగా విస్తరణ జరుగుతుంది అని పార్టీ నేతలు అంటున్నారు.