దేశంలోనే హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణ రాష్ట్రం కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో హెచ్‌సీఎల్ కేఆర్‌సీ కొత్త క్యాంపస్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీయం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ నూతన క్యాంపస్‌ని ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిరోజు మేము ఏదో ఒక బహుళజాతి సంస్ధతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో, పెద్ద సంస్ధలు తెలంగాణకు రావడమో, గత సంవత్సరం చేసుకున్న ఎంఓయూలను గ్రౌండ్ చేసి ప్రారంభించడమో జరుగుతోందని పేర్కొన్నారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెబుతున్నాన్నారు. ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్‌గా నిలిచామని తెలిపారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తామని మేము చెపుతుంటే అది సాధ్యం కాదని కొందరు ఎద్దేవా చేశారని కానీ రెండు సార్లు దావోస్ పర్యటనలో మొదటి సారి 41వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే రెండో సారి దావోస్ పర్యటనలో ఏకంగా ఒక లక్షా 78వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలపై సంతకాలు పెట్టి తెచ్చిన తరువాత ఇప్పుడు వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధ్యమని నమ్ముతున్నారని రేవంత్‌రెడ్డి వివరించారు. తెలంగాణ ఎదుగుదలను ఎవరూ ఆపలేరన్నారు. మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలు కాదని నేను చెప్పినప్పుడు కొంతమంది ఇది అతిపెద్ద కల అని విమర్శించారని ఇప్పుడు ఈవీ అడాప్షన్‌లో హైదరబాద్‌ని నెంబర్ వన్ గా చేశాక తెలంగాణ రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్, మ్యానుఫ్యాక్ఛరింగ్, అగ్రి ప్రోసెస్ రంగాలకు హబ్‌గా మారుస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్ ను కొద్దిరోజుల క్రితం ప్రారంభించుకున్నాం, ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాలలో ఒకటైన బయో ఏషియాను నిర్వహించాం… ఇవాళ హెచ్‌సీఎల్ లో ఉన్నామని రేవంత్‌రెడ్డి వివరించారు. గ్లోబల్ కంపెనీగా హెచ్ సీ ఎల్ టెక్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిందని ఈ కంపెనీ 2.2 లక్షల మందికి పైగా ఉద్యోగులతో 60 దేశాలలో ఆపరేట్ చేస్తోందని తెలిపారు. 2007లో హెచ్‌సీఎల్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగుతూ నేడు 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 5 వేల మందితో కేఆర్ సీలో ప్రపంచస్థాయి సదుపాయంతో హెచ్ సీఎల్ టెక్ హైదరాబాద్ లో గొప్ప పనులు చేస్తుందని సీయం రేవంత్ రెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు హెచ్ సీఎల్ సిబ్బంది పాల్గొన్నారు.