-
రాష్ట్రంపై విషం కక్కుతున్నారన్న డిప్యూటీ సీఎం
-
సామాజిక పరివర్తన కాంగ్రెస్ సిద్ధాంతం
-
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడం బీఆర్ఎస్, బీజేపీ వల్ల కాదు
-
బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను ప్రారంభిస్తాం.. నీళ్లు ఇస్తాం
-
మంచిర్యాల బహిరంగసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, బిసి కుల గణన, ఎస్సీ వర్గీకరణతో దళితులు, బీసీలు, గిరిజనులు లాభపడడం ఇష్టం లేని బీఆర్ఎస్, బిజెపి పక్షాలు రాష్ట్రంలో రాజకీయ అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఆ పార్టీల నేతలు రాష్ట్రంపై విషం కక్కుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం బీసీ కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ వంటి పెద్ద కార్యక్రమాలు చేపట్టిందని, వాటిని అడ్డుకోలేక బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నాడు పీవీ నరసింహారావు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూసంస్కరణలు చేపట్టగా దానిని అడ్డుకునేందుకు జై ఆంధ్ర ఉద్యమం తెచ్చారని, అదే తరహాలో ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ఆక్షేపించారు. కుల గణన ద్వారా ఎవరి జనాభా ఎంతో గుర్తించి సంక్షేమ ఫలాలు పంచుతామని, సామాజిక పరివర్తన కాంగ్రెస్ సిద్ధాంతం ఇదే నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి సహా యావత్ క్యాబినెట్ ముందుకు పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం బీఆర్ఎస్, బీజేపీ నేతల తరం కాదని స్పష్టం చేశారు. సామాజిక పరివర్తన కోసం కుల గణన సర్వే చేసి వదిలి పెట్టలేదని అసెంబ్లీలో తీర్మానం చేసి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ధర్నా నిర్వహించిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.
దేశ సంపద పదిమంది క్రోనీ క్యాపిటల్స్ చేతిలో బందీ అయిందని దానిని బద్దలు కొట్టి దేశ ప్రజలకు పంచాలని ఇటీవల గుజరాత్‌లో రాహుల్ గాంధీ తీర్మానం చేశారని వివరించారు.
రాహుల్ గాంధీ దార్శనికుడని, అదానీ అంబానీ వంటి క్రోనీ క్యాపిటల్స్ దేశ సంపదను దోపిడీ చేస్తున్న విషయాన్ని భారత్ జోడోయాత్ర ద్వారా దేశ ప్రజలకు చాటి దిశా నిర్దేశం చేశారని వివరించారు. సంపద సృష్టించాలి ప్రజలకు పంచాలన్న రాహుల్ గాంధీ మాటకు కట్టుబడి రాష్ట్ర క్యాబినెట్ మొత్తం పనిచేస్తుందన్నారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి సాగునీరు అందిస్తామని అన్నారు. సాధారణ ఎన్నికల ముందు ఇదే ఏప్రిల్ 14వ తేదీన మంచిర్యాల కేంద్రంలో తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరై సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుందని ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా తాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించగా స్థానికులు చూపిన ఆదరణను మర్చిపోలేనని అన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ప్రతి పాఠశాలను 25 ఎకరాల్లో రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో ఒకేసారి 58 పాఠశాలల నిర్మాణానికి 11,600 కోట్లు ఒకేసారి విడుదల చేశామన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ ఇలాంటి పరిణామం జరగలేదన్నారు. అటవీ హక్కుల కింద గిరిజనులకు భూములు పంపిణీ చేస్తే గత పాలకులు మహిళలని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటనలు ఉన్నాయని, తాము మాత్రం అడవి బిడ్డల కోసం రూ.12,500 కోట్లతో ఇందిరా గిరి జలవికాసం పథకం చేపడుతున్నామని ఈ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ద్వారా పంపుసెట్ల నిర్వహణ, డ్రిప్పు, స్ప్రింక్లర్లను వినియోగించి గిరిజన రైతుల ద్వారా అవకాడో, వెదురు వంటి పంటలు సాగు చేయిస్తాయన్నారు.
10 సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ మహిళలను మరిచిపోయిందని, తాము అధికారంలోకి రాగానే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని నిర్ణయించామన్నారు. ఐదు సంవత్సరాల్లో మహిళా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా మొదటి సంవత్సరం లక్ష్యానికి మించి 21 వేల కోట్లు వడ్డీ లేని రుణం కింద అందించామని చెప్పారు. మహిళా సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 1000 మెగావాట్ల ఒప్పందం కుదుర్చుకుందామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ క్యాంటీన్లు, వారి నుంచి ఆర్టీసీకి లీజుకు బస్సులు తీసుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా మహిళ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
ఉద్యోగాల కోసం యువత కోరి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని, వారి ఆశలు నిజం చేసేందుకు ఇప్పటికే 56,000 ఉద్యోగాలు భర్తీ చేసామని, ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువత కోసం 9,000 కోట్ల తో రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించామన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నిరుద్యోగ యువకులకు రాజీవ్ యువ వికాసం కింద శాంక్షన్ లెటర్లు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని తెలిపారు. రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ కింద మూడు నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు.
రాష్ట్రంలోని 3.1 కోట్ల మంది పేదలకు ఉగాది నుంచి సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ఇందుకుగాను ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.13,525 కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని, ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన రూ.433 కోట్లు ఇప్పటికే చెల్లించిందని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు గృహజ్యోతి పథకం కింద ఇప్పటి వరకు 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని వారి పక్షాన ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.1,775 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని చెల్లించిందని తెలిపారు. సోమవారం ఒక్కరోజే మంచిర్యాల నియోజకవర్గంలో సుమారు 1,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేసుకున్నామని, మంచిర్యాల అభివృద్ధికి ఇది ఆరంభం మాత్రమే అన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.