– క్వాంటం కంప్యూటింగ్ లో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’
– త్వరలో ఏఐ సిటీకి శంఖుస్థాపన
– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎక్కడ.. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. శుక్రవారం మాదాపూర్ లో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో సుమారు 1800 మందికి ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్ సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నూతన క్యాంపస్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కొత్త సాంకేతికతల ఆవిష్కరణలో తెలంగాణను నంబర్ వన్ గా నిలిచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్న మంత్రి.. ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు స్కిల్స్ యూనివర్సిటీ, పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ యూనివర్సిటీకి త్వరలో శంఖుస్థాపన చేయబోతున్నామని చెప్పారు. ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించబోతున్నామని వివరించారు. దేశంలో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉందన్న శ్రీధర్‌బాబు.. ఆ హబ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని కోరామన్నారు. ఇక్కడి అనుకూలతలను ప్రత్యేకంగా వివరించామని, ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. పౌర సేవలను చివరి వ్యక్తి వరకు సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏఐ, బ్లాక్ చెయిన్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను విరివిగా వినియోగించుకోబోతున్నామన్నారు. ఇటీవలి కాలంలో కీలకంగా మారిన డ్రోన్ టెక్నాలజీపై తెలంగాణ యువతకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి.. వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు. 1800 మంది యువకులకు ఉపాధి కల్పిస్తున్న తమ సంస్థ గురించి చెప్పగానే.. ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి శ్రీధర్‌బాబుకు సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్ సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు రాధాకిషోర్, వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి స్వయంగా తమ సంస్థను ప్రారంభించడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, ఐటీ సర్వీసుల్లో హైదరాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రిజల్ట్ చూపిస్తామని సంస్థ నిర్వాహకులు హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు పర్యటనలో ఆయన వెంట నేమాని మీడియా హౌస్ ఎండీ నేమాని భాస్కర్ తదితరులు ఉన్నారు.