29 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ ఈ రెండు రాష్ట్రాలే!

  • దక్షిణాదిలో కర్నాటకపై కన్ను

  • ఉత్తరాదిలో పంజాబ్‌కు ఎసరు

  • పక్కా ప్లాన్‌లు వేస్తోన్న కమలం పార్టీ

భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఫుల్‌ జోష్‌లో ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. ఇదే జోష్‌లో మరో రెండు రాష్ట్రాలపై దృష్టి పెట్టిందన్న చర్చ నడుస్తోంది. ఢిల్లీ మాదిరిగానే కాషాయ దళాలను సైలెంట్‌గా రంగంలోకి దింపడం ఓ అంశమైతే.. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం పాలన సాగిస్తోన్న ప్రభుత్వాల స్వయంకృతాపరాధం తమకు కలిసి వస్తుందని కూడా కమలం పార్టీ బలంగా విశ్వసిస్తోంది.

బీజేపీ కన్నేసిన ఆ రెండు రాష్ట్రాలు చూస్తే.. దక్షిణాదిలో ఒక రాష్ట్రం.. ఉత్తరాదిలో మరో రాష్ట్రం ఉన్నాయి. దక్షిణాదిలో చూస్తే.. కాంగ్రెస్‌ పార్టీ రూలింగ్‌లో ఉన్న కర్నాటక కాగా.. ఉత్తరాదిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌ మరో రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వేయాలన్న సంకల్పం తీసుకున్నారు బీజేపీ నేతలు. అధిష్టానం కనుసన్నల్లో ఆయా రాష్ట్రాలపై కిందిస్థాయి నేతలు దృష్టి సారించారు.

రెండున్నర దశాబ్దాలుగా బీజేపీకి అందని ద్రాక్షగా మారిన ఢిల్లీని ఎట్టకేలకు చేజిక్కించుకుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రంలో కమలం వికసిస్తూనే ఉంది. గత మూడుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ తుఫాను ముందు నిలవలేకపోయినా బీజేపీ ఈసారి ఆప్ కంచుకోటను బద్ధలు కొట్టింది. మోదీ విజయ మంత్రానికి చీపురు తుడిచిపెట్టుకుపోయింది.

బీజేపీ ఒకసారి వ్యూహం పన్నాక.. విజయం సాధించే వరకు ఆయా రాష్ట్రంలో నిమగ్నమై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని ఉదాహరణ అనేక రాష్ట్రాల్లో కనిపించింది. ఓటమిని సమీక్షించుకుని నూతన ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొనడమే బీజేపీ విజయ మంత్రంగా మార్చుకుంది. అదేవిధంగా ఒడిశాలో గెలిచింది. పశ్చిమ బెంగాల్‌లో మద్ధతు పెంచుకుంది. దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో తన ఉనికిని పెంచుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో తన ప్రయాణాన్ని సున్నా నుండి ప్రారంభించి నెమ్మదిగా ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ విజయం దిశగా దూసుకెళ్తోంది.

మిషన్‌ కర్నాటక, మిషన్‌ పంజాబ్‌ :

ఢిల్లీలో కేజ్రీవాల్‌ క్రేజీని తగ్గించేందుకు దశాబ్దకాలంగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి లిక్కర్‌ స్కామ్‌ అంశం వెతకబోయే తీగ కాలికి తగిలినట్లయ్యింది. దీంతో, లిక్కర్‌ స్కామ్‌ను ఆయుధంగా మార్చుకున్న బీజేపీ.. ఢిల్లీ ఓటర్ల మైండ్‌సెట్‌ మార్చేసింది. ప్రధానంగా ఈ అంశమే ఆప్‌ను ఢిల్లీలో ఓటమి పాలు చేసింది. ఈ ఊపులోనే ఉన్న బీజేపీ.. మిషన్‌ కర్నాటక, మిషన్‌ పంజాబ్‌ మొదలుపెట్టిందన్న టాక్‌ నడుస్తోంది. దేశంలో బీజేపీ దృష్టి సారించేందుకు మిగతా రాష్ట్రాలు ఉన్నప్పటికీ.. కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ పాలన, నిర్ణయాలే తమకు కలిసొస్తాయని, ఈజీగా అక్కడ పాగా వేయొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఇక, పంజాబ్‌లో కూడా ఇంచుమించు అదే ఆలోచనతో ఉంది బీజేపీ. ఎందుకంటే ఆప్‌కు సెంటర్‌ పాయింట్ అయిన న్యూఢిల్లీలో ఆ పార్టీ ఘోర ఓటమి పాలయ్యింది. ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థే ఓటమి పాలయ్యారు. అంతేకాదు.. ఆ పార్టీలో ముఖ్యనేతలందరూ ఓడిపోయారు. ఈ పరిణామం పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న ఆప్‌పై పడింది. ఢిల్లీ మోడల్‌ స్ట్రాటజీలు అమలు చేసి అయినా పంజాబ్‌ పీఠాన్ని కూడా దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇప్పుడు బాగా లేదు. ఓవైపు అవినీతి ఆరోపణలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు.. ఆ పార్టీలో సహజంగానే ఉండే అంతర్గత పోరు ఉండనే ఉంది. ఇప్పటికే మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ-ముడా భూ కేటాయింపుల కేసు అక్కడి కాంగ్రెస్‌ సర్కారును వెంటాడుతోంది. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్‌ పీకల్లోతు కూరుకుపోయింది. వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకూ సంబంధం ఉన్నట్టు ఆరోపణలు కూఆ వచ్చాయి. దీంతో, కాంగ్రెస్‌ అంటేనే కరప్షన్‌, కమిషన్లు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. నానాటికీ ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ మరోసారి గెలవడం అంత సులభం కాదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. వీటికి తోడు.. ఇటీవల ప్రయాగ్‌ రాజ్‌ కుంభమేళాకు వెళ్లిన కర్నాటక కాంగ్రెస్‌లో కీలక నాయకుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌.. అక్కడ రహస్యంగా కొందరితో సమావేశమయ్యారన్న టాక్‌ నడుస్తోంది. ఈ రహస్య భేటీ వెనుక మతలబుపై రకరకాలుగా చర్చ జరుగుతోంది.

అటు.. ఉత్తరాదిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నడిపిస్తోన్న పంజాబ్‌ రాష్ట్రంపై కమలం పార్టీ గురిపెట్టింది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు స్వయంగా అంత పాపులారిటీ లేదన్నది మొదటినుంచీ ఉన్న అభిప్రాయం. ఆయన కేజ్రీవాల్‌ మాటు ముఖ్యమంత్రి అన్న ప్రచారం కూడా ఉంది. ఈ తరుణంలో పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి.. పార్టీ అడ్రస్‌ గల్లంతు కావడమే కాదు.. ఏకంగా కేజ్రీవాల్‌ కూడా ఓడిపోయారు. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్‌ను చూపించి భగవంత్‌ మాన్‌ పంజాబ్‌ ప్రజలనుంచి మెప్పు పొందడం కూడా కష్టమే అనిపిస్తోంది. మరోవైపు.. ఢిల్లీ ఎన్నికల్లో తిరుగు లేని పాశుపతాస్త్రంగా వాడిన లిక్కర్‌ స్కామ్‌ను పంజాబ్‌ లోనూ అదను చూసి ప్రయోగించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకున్నది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com