-
రాజధాని విస్తరణకు మరింత భూ సేకరణ
-
కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులకు చెందిన ఫైళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. కీలక పనులకు టెండర్లను పిలవడానికి సీఆర్డీఏ అధికారులు చర్యలు చేపట్టారు. అటు కేంద్రం సహకారం, ఇటు బ్యాంకుల రుణాలు, మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అమరావతి విస్తరణ కోసం ఇంకో 30 ఎకరాల స్థలాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీంతో, రాజధాని అమరావతి ప్రాంత రైతులపై మరో పిడుగు పడింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో ముప్ఫయి వేల ఎకరాల భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్ కాపిటల్ బయట మరో ముప్ఫయివేల ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తోంది. రాజధాని భవిష్యత్ అవసరాల కోసం ఈ ముప్ఫయి వేల ఎకరాలను సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న భూములకు అదనంగా మరో ముప్ఫయి వేల ఎకరాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోందట. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు, రైల్వే లైన్ సహా ఇతర పారిశ్రామిక సంస్థల కోసం ఈ ముప్ఫయి వేల ఎకరాల భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ దిధశగా రైతులను ఒప్పించి మరో ముప్ఫయి వేల ఎకరాలను సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు 29 గ్రామాల పరిధిలో 32 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో మొదటి దశ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పనుల కోసం టెండర్లను పిలిచి ఖరారు చేశారు.
ఇక, అమరావతి విస్తరణ కోసం ఏపీ సర్కారు అదనంగా మరో 30 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది. రాజధాని చుట్టూ భూ సేకరణపై సీఆర్డీఏ చర్యలు ప్రారంభించింది. అమరావతి కోర్ క్యాపిటల్ బయట ఉన్న 20కి పైగా గ్రామాల్లో ఈ భూసేకరణ చేపట్టే అవకాశం ఉదంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు టెక్నో-ఫీజిబిలిటీ నివేదిక కోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. సాంకేతిక నివేదికను త్వరగా రూపొందించి కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపనున్నారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చాక తదుపరి చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా సేకరించే భూమిలో ఎయిర్‌పోర్ట్ కోసం స్థలాన్ని కేటాయించే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం అమరావతిలో ప్రపంచ స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌లలో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. దాదాపు 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మించే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం దీనికి అదనంగా భూమిని కేటాయించనున్నారు. అమరావతిలో ఇప్పటికే పలు ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్నింటిని స్థాపించే అవకాశం కనిపిస్తోంది. . వాటి స్థాపనకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసి ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అమరావతి ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీ ధరలకు భూమిని కేటాయించే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమిని కాకుండా.. కొత్తగా సేకరించిన దాంట్లో ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం.రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిలో కొన్ని కొత్త నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది. అందుకోసం చాలా భూమి అవసరం అవుతుంది. అందుకే కొత్తగా భూసేకరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇక, అమరావతిని ఒక ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనేక ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. వాటికి కూడా భూమి కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు.. సర్వే సంస్థల రిపోర్టుల ప్రకారం.. అమరావతిలో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. రానున్న కొద్ది సంవత్సరాలలో ఇక్కడ మరిన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను మొదలుపెట్టే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ పునః శంకుస్థాపన చేసిన తర్వాత పనులు శరవేగంగా సాగేలా ఇప్పటినుంచే వ్యూహాలు రూపొందిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న 32 వేల ఎకరాలు సరిపోదని భావించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోర్ కాపిటల్ బయట వైపు మరో 30 వేల ఎకరాలను సేకరించేందుకు సిద్ధమయింది. దీంతో రైతుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. రైతులను ఒప్పించే బాధ్యత ప్రస్తుతానికి అధికారులకు అప్పగించారు. వారికి నచ్చ చెప్పి రాజధాని అమరావతి ప్రాంతంలో ప్లాట్లు ఇస్తామని చెప్పడంతో పాటు రాజధాని అభివృద్ధికి సహకరించాలని కోరనున్నారు. మరి రైతుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.