తెలంగాణలో రైతులకు ప్రభుత్వం సంక్రాంతి పండుగకు గుడ్‌న్యూస్ చెప్పబోతోందా? అన్నదాతలకు సంక్రాంతి కానుక ప్రకటించేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైందా? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం ఈ మేరకు తీపికబురు అందించే రిపోర్ట్‌ను రెడీ చేసిందా? నిజమే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో పలువురు మంత్రివర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్నదాతలకు సంక్రాంతి కానుకగా.. జనవరి 14వ తేదీ నుంచి పెట్టుబడి సాయం అందించాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పథకం అమలు చేయడంలో భాగంగా జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని భట్టి నేతృత్వంలోని సబ్ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సాగు చేసే భూములకే రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా.. సబ్ కమిటీ కూడా ఇదే నిర్ణయాన్ని వెలిబుచ్చినట్టు సమాచారం. అయితే.. సాగు భూములను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించనున్నారు. ధరణి ప్రకారం కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలుస్తుండగా.. అందులో నుంచి సాగు చేయని భూములు తీసేస్తే.. కోటి 30 లక్షల ఎకరాలకు రైతుభరోసా ఇవ్వాలని అధికారులు సూచించినట్టు తెలుస్తోంది.
కేబినెట్ సబ్ కమిటీలో వెలువడిన అభిప్రాయాలు, కమిటీ తీసుకున్న నిర్ణయాలతో డీటెయిల్డ్ రిపోర్ట్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ నివేదికతో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క.. రేపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవబోతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలు, ఈ పథకం అమలు కోసం అనుసరించాల్సిన అంశాలకు సంబంధించి సబ్‌కమిటీ మార్గదర్శకాలను సీఎం రేవంత్‌కు వివరిస్తారు. ఎల్లుండి అంటే..శనివారం నిర్వహించనున్న కేబినెట్ మీటింగ్‌లో రైతు భరోసా అమలుపై తుది నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి రాష్ట్రంలోని రైతులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకానికి ముహూర్తం దాదాపు ఫిక్స్ అయినట్టే అని చెబుతన్నారు. అయితే, దరఖాస్తుల ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎవరెవరికి పెట్టుబడి సాయం అందుతుందన్నది సస్పెన్స్‌గా ఉంది. మార్గదర్శకాలేంటి, ఏఏ ప్రాతిపదిక డబ్బులు అందిస్తారన్న పలు అంశాలపై ప్రభుత్వం మరో రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.