తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు కాసేపట్లో అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. సరిగ్గా 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం మొదలు కానుంది. ఈ సందర్భంగా అసెంబ్లీకి బయలు దేరే ముందు భట్టి విక్రమార్క సతీ సమేతంగా బడ్జెట్ ప్రతులకు పూజలు నిర్వహించారు.
ప్రజా భవన్‌లోని నల్ల పోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతులను అమ్మవారి ఆలయంలో ఉంచి ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఆలయంలో వేద పండితులు.. ఉప ముఖ్యమంత్రి దంపతులను సాదరంగా ఆహ్వానించి బడ్జెట్ ప్రతులకు పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు.
అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీకి బయలు దేరి వెళ్లారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు.
వార్షిక బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ సెక్రటరీ నరసింహచార్యులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.