ఆదివారం వరంగల్ పర్యటనకు వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గమధ్యంలో ఓ హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఉన్నపళంగా ఉపముఖ్యమంత్రి తమ హాస్టల్‌కు రావడంతో అధికారులు, హాస్టల్ సిబ్బంది టెన్షన్ పడ్డారు.
వరంగల్ వెళ్తున్న సమయంలో యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని పాత వరంగల్ రోడ్ లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ హాస్టల్‌ను తనిఖీ చేద్దామని సిబ్బందితోచెప్పడంతో అక్కడ కాన్వాయ్ ఆగింది. డిప్యూటీ సీఎం నేరుగా హాస్టల్‌లోకి వెళ్లడంతో అందరూ అవాక్కయ్యారు.
డిప్యూటీ సీఎం హాస్టల్‌లో పర్యటించిన సమయంలో ఆయన వెంట భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న విద్యార్థినులతో మాట్లాడారు. హాస్టల్‌లో ఉన్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న వాళ్లు విజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు.. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. వాళ్లకు మంచి పౌష్టికాహారం, ఆరోగ్య కరమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతోనే మెస్ ఛార్జీలు పెంచామని ఆయన గుర్తు చేశారు.