- లిస్టులో సెలబ్రిటీలు,యాంకర్లు, యూట్యూబర్లు
- ఆ యాప్స్ కి ప్రమోషన్ తప్పంటున్న ప్రభుత్వం
- ఎడా పెడా కేసులతో చేసేది హడావుడి ఏనా?
- బెట్టింగ్ యాప్స్ పై స్పందించాల్సింది ఎవరు?
- ఇది మరో డ్రగ్స్ కేసులో మారుతుందా?
బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం నిర్వహిస్తున్నారంటూ టాలీవుడ్, బుల్లితెర సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫుయేన్షర్లకు గత వారం రోజులుగా నోటీసులు ఇచ్చి పోలీసులు, ప్రభుత్వాలు హడావుడి చేస్తున్నాయి. రాణా లాంటి పేరొందిన పెద్ద పెద్ద సెలబ్రిటీలే వాటికి ప్రచారం చేస్తున్నారు. మరిక బుల్లితెర యాంకర్లు, చిన్న స్థాయి యూట్యూబర్లు చేసే ప్రచారాన్ని సైతం పోలీసులు, ప్రభుత్వం భూతద్దంలోంచి చూసి కేసులు, నోటీసులంటూ హడావుడి చేసి భయపెడుతోంది. ఒక యాడ్‌కు ప్రచారం చేసిన పాపానికి వారిని ఇన్వెస్టిగేషన్, లోతైన విచారణ పేరుతో గంటల తరబడి పోలీస్ స్టేషన్ లోనే ఉంచేస్తోంది. యాంకర్ విష్ణు ప్రియ లాంటి వారిని ఏకంగా 13 గంటలు విచారించారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రమోషన్ తప్పేనని గట్టిగా నిలదీస్తే వారే అంగీకరిస్తారు. దానికి తగిన పరిహారం, మూల్యం కూడా చెల్లిస్తారు. వారిని గంటల తరబడి విచారించేందుకు ఏముంటుందో పోలీసులు, ప్రభుత్వాలకే తెలియాలి. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే హడావుడి కనిపిస్తోంది.యాంకర్ శ్యామలకి కూడా ఇదే కేసులో నోటీసులిచ్చారు. ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామల కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేశారని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె లాయర్ సహాయంతో హై కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే విచారణకు సహకరించమంటూ కోర్టు సలహా ఇచ్చింది.
ప్రకాష్ రాజ్ కొంత బెటర్
నటుడు ప్రకాష్ రాజ్ టాలీవుడ్ లో చాలా పేరున్న నటుడు. దక్షిణాది చిత్రాలన్నింటిలోనూ ఆయన కీలక పాత్రలు వేస్తుంటారు. ఆయన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో చిక్కుకున్నారు. ఆయనకు కూడా పోలీసులు నోటీసులు సెర్వ్ చేశారు.కానీ దాని మీద ఆయన వివరణ కూడా ఇచ్చారు. 2016లో తాను ఒక బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేసినట్లు, ఆ తర్వాత అది చట్టబద్ధం కాదని తెలుసుకుని మానేసినట్లు తెలిపారు. 2017లో కూడా అదే యాప్ నిర్వాహకులు మరోసారి ప్రచారం చేయాలంటూ వెంట పడ్డారని అయితే వాళ్లది తప్పుడు యాప్ అని అర్ధమయ్యాక ప్రచారం మానేసి అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారట. ఆ తర్వాత 2019లో అదే యాప్ వారు ఆయన పాత యాడ్‌ని మరోసారి లైమ్ లైట్ లోకి తెచ్చారట. దాంతో ఆయన వారికి లీగల్ నోటీసులు సెర్వ్ చేసి వారిని ఉపసంహరించుకునేలా చేశానన్నారు. అప్పటి నుంచి తాను బెట్టింగ్ యాప్ యాడ్స్ జోలికి పోవడం లేదని ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ప్రభుత్వం వెల్లడించిన పేర్ల జాబితాలో తన పేరు కూడా ఉందని, ఒకవేళ విచారణకు పిలిస్తే తాను అదే చెబుతానని కూడా ప్రకాష్ రాజ్ అన్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో అన్నీ నిలదీస్తున్న నేను.. నాపై వచ్చిన ఆరోపణలకు కూడా వివరణ ఇవ్వడం సహేతుకమని పించి చెబుతున్నానని అన్నారు.
మెగా స్టార్ కూడా…
మెగా స్టార్ చిరంజీవి కూడా గతంలో తెలియక కొన్ని బెట్టింగ్‌యాప్స్ కి ప్రచారం చేశారు. అయితే అవి తప్పుడువని , అలా చేయడం చట్ట విరుద్ధమని తెలిశాక వాటికి దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన అలాంటి ప్రచారం చేయలేదు. సీపీఐ నేత నారాయణకూడా ఇదే విషయం థృవీకరించారు.
ఇదొక హంగామానా? లేక?
ఇక బెట్టింగ్ యాప్స్ లో పేరొందిన నటులే కాదు, నటీమణులు కూడా ఉన్నారు. వారందరినీ కూడా పోలీసులు విచారణకు పిలుస్తున్నారు.అయితే వారినుంచి వివరణ తీసుకుని వదిలేస్తారా? లేక చర్యలేమైనా ఉంటాయా అన్న సందేహాలు మాత్రం కలుగుతున్నాయి.ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసులో ఎందరో ఉన్నారంటూ అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అకున్ సబర్వాల్ సారధ్యంలో టాలీవుడ్ నటులను విచారణలకు పిలిచి హడావుడి చేశారు. ఆ తర్వాత ఆ కేసు మూలన పడింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ పై చర్యలంటూ హడావుడి చేస్తోంది. ఇది కూడా హైడ్రా చర్యలలా హడావుడి పబ్లిసిటీనా లేక చిత్తశుద్ధితో సమాజాన్ని మెరుగు పరచడానికి చేస్తున్నవా? కాలమే చెప్పాలి.
తప్పొకరిదైతే, శిక్ష మరొకరికా?
అసలు బెట్టింగ్ యాప్స్ పై అనుమతులెవరిస్తున్నారు? ప్రభుత్వాలు కావా? వాటిపై నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉండగా, వాటికి పబ్లిసిటీ ఇచ్చారంటూ సెలబ్రిటీలను పిలవడం ఎందుకు? వారిని ఇరుకున పెట్టడం ద్వారా ప్రభుత్వం డైవర్షన్ టాక్టిక్స్ చేస్తోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. రోగం ఒకరికి వస్తే వైద్యం ఇంకొకరికి చేస్తున్నారా? అలాంటి యాప్స్ కి పబ్లిసిటీ చేయడం తప్పే.. మరి అలాంటి యాప్స్ సమాజంలో యధేచ్ఛగా సర్క్యులేట్ అవుతూ బిజినెస్ చేసుకోవడం మాత్రం కరెక్టెలా అవుతుంది? ప్రభుత్వాలు ముందు ఆ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. లేదా ఆ యాప్స్ ను నిషేధించాలి. గతంలో టిక్ టాక్ ను బ్యాన్ చేసినట్లే వీటిని చేయాలి.