కాంగ్రెస్ పార్టీలో రాజకీయం మలుపులు తిరగబోతోంది. పార్టీని నయా దిశలో నడిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త కార్యచరణతో ముందుకు వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రెడ్డి నాయకుడిగా పేరున్న సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకోబోతున్నారని సీఎం సన్నిహితులు చెపుతున్నారు.
ఇటీవల కులణన గణాంకాలు మదింపు చేసిన తర్వాత సీఎం…విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టబోతున్నారని తెలిసింది. తెలంగాణలో బలమైన వర్గంగా ఉన్న బీసీలకు ప్రభుత్వంలో, పార్టీలో సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని… తద్వారా వారిని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్‌టి రామారావు వచ్చే వరకు బీసీల ప్రాతినిధ్యం రాజకీయాల్లో అంతంతమాత్రమే. ఎన్‌టి రామారావు విధానాలతో బీసీలకు పదవులు దక్కాయి. దీంతో ఈనాటికి బీసీల పక్షపాతిగా ఎన్‌టి రామారావును బలహీన వర్గాల సంఘాలు స్మరించుకుంటాయి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కూడా ఎన్‌టి రామారావు స్థాయిలో ఉంటాయని…తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాయని అంటున్నారు. ఇందులో భాగంగా త్వరలో రజక సమర భేరి నిర్వహించనున్నారు. రజక భేరికి సంబంధించి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల శంకర్ తెరవెనుక సన్నాహాలు ప్రారంభించారు. అదే కోవలో ముదిరాజ్ సామాజిక వర్గంతో ముదిరాజ్ మహాసభ పెట్టేందుకు ఆ పార్టీ నేతల నీలం మధుకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని సమాచారం.
తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గంగపుత్ర గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాడు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి కొఠారికి చెందిన వారు కావడంతో కాంగ్రెస్ రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయని పార్టీలో సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ కూడా బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సమున్నతమైన ముఖ్యమంత్రి పదవి అలంకరించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చరిత్ర గుర్తుంచుకునే రీతిలో నిర్ణయాలు తీసుకునేందుకు భారీ కసరత్తే చేస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలో జరిగే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నాటి నుంచే సీఎం రేవంత్ మార్క్ కనిపిస్తుందని అంటున్నారు.
బలహీన వర్గాల దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు వెలువడితే బీఆర్‌ఎస్, బిజెపిల మీద కూడా ఒత్తిడి పెరగనుంది. ఫలితంగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రమే మారుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.