33.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

సినిమాల్లో అసభ్యకర నృత్యాలు మానుకోవాలి

తెలంగాణ మహిళా కమీషన్‌ చైర్మన్‌ హెచ్చరిక

తెలుగు సినిమా పరిశ్రమలో అసభ్యకరమైన కంటెంట్‌ని ప్రోత్సహించవద్దని తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయని ఆమె ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించేలా కానీ అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆమె అన్నారు.

ఈ నేపథ్యంలో, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు మరియు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరించింది. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలని ఆమె సూచించారు. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నేరెళ్ళ శారద ప్రకటించారు.

సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత అని మహిళా కమీషన్ చైర్ పర్సన్‌ హితవు పలికారు. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని నేరెళ్ళ శారద అన్నారు.

ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయమని కోరారు. ఈ విషయం పై నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ మహిళా కమీషన్‌ చైర్‌ పర్సన్‌ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com