28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

జర్నలిస్టులకు రక్షణ అరణ్య రోదనేనా? ఇంకెన్నాళ్లీ నిరసనలు, డిమాండ్లు?

– మొన్న తెలంగాణలో జర్నలిస్టుపై మోహన్‌బాబు హత్యాయత్నం
– నిన్న ఏపీలో జర్నలిస్టులపై టీడీపీ మూకల మర్డర్‌ అటెంప్ట్‌
– దాడులు జరిగినప్పుడే జర్నలిస్టుల రక్షణపై చర్చ

విధి నిర్వహణలో భాగంగా వార్తలను, జరుగుతున్న పరిణామాలను ప్రజలకు అందించాలనుకుంటున్న జర్నలిస్టులపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరిగిన దాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న నటుడు మోహన్‌బాబు టీవీ 9 జర్నలిస్టుపై మీడియా కెమెరాల సాక్షిగా అత్యంత దారుణంగా దాడి చేశారు. అది జరిగిన రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి జర్నలిస్టులపై టీడీపీ వర్గాలు అత్యంత ఘోరంగా దాడికి పాల్పడ్డారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల భద్రతపై ఈ రెండు సంఘటనలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఒకటేమో తెలంగాణలో జరిగితే, మరొకటి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఈ రెండు సంఘటనల్లోనూ జర్నలిస్టులపై దాడులు చేసిన వాళ్లు వీధి రౌడీల మాదిరిగా రెచ్చిపోయారు. మోహన్‌బాబు మీడియా మైక్‌తోనే మీడియా ప్రతినిధి తలపై బాదారు. అటు.. ఏపీలో జరిగిన సంఘటనలో టీడీపీ శ్రేణులు.. సాక్షి టీవీ, పత్రిక జర్నలిస్టులపై రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. గల్లీ రౌడీల మాదిరిగా వ్యవహరించారు. ఈ రెండు సంఘటనలు జర్నలిస్టుల మనుగడకు ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

హైదరాబాద్‌ శివార్లలోని జల్‌పల్లిలో ఉన్న మంచు మోహన్‌బాబు ఇంటిదగ్గర గత మంగళవారం ఓ రకంగా చిన్నపాటి యుద్ధ వాతావరణమే నెలకొంది. అవి బయటి తగాదాలు కాదు. కుటుంబసభ్యుల మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్‌ తండ్రి ఇంటి గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లాడు. వెంట బౌన్సర్లు, తన స్నేహితులను కూడా తీసుకెళ్లాడు. అదే సమయంలో మీడియాకు కూడా సమాచారం ఇచ్చాడు. దీంతో, సినీ పరిశ్రమకు చెందిన కుటుంబం కావడం, ఒకే ఇంట్లో నలుగురు సినీ నటులు ఉండటంతో ఈ పరిణామాలను రిపోర్ట్‌ చేయడం మీడియాకు అనివార్యంగా మారింది. పైగా మంచు మనోజ్‌ సమాచారం ఇవ్వడంతో మీడియా అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ఇరువర్గాల ఘర్షణలో వాళ్లలో వాళ్లకు గాయాలయ్యాయి.
అయితే, ఇంటి సమస్యను బజారుకు ఈడ్చుకున్న మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ.. తమ ఆక్రోశాన్ని మీడియాపై చూపించారు. అక్కడే ఉన్న జర్నలిస్టు దగ్గర మైక్‌ లాక్కున్న మోహన్‌బాబు.. టీవీ నైన్‌ జర్నలిస్టు రంజిత్‌ తలపై ఆ మైక్‌తో బలంగా కొట్టాడు. దీంతో, రంజిత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రంజిత్‌కు ఆపరేషన్‌ కూడా చేయాల్సి వచ్చింది. రంజిత్‌ ఇంకా కోలుకోలేదు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.

ఇక, తాజాగా చూస్తే.. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పరిణామాలే నెలకొన్నాయి. అయితే, మోహన్‌బాబు ఫ్రస్ట్రేషన్‌లోనో, వాళ్ల ఇంటి తగాదా ఆక్రోశాన్ని మీడియా మీద చూపించారు. కానీ, ఏపీలో మాత్రం అధికార పార్టీ నేతలు పక్కా ప్లాన్‌గానే మీడియామీద దాడిచేశారన్న విషయం అవగతమవుతోంది. ఎందుకంటే.. మీడియాపై దాడి చేసిన మూకలు రౌడీల్లాగా చెలరేగిపోయారు. కర్రలు, రాళ్లతో రెచ్చిపోయారు. జర్నలిస్టులని తెలిసీ, వెంటపడి మరీ దాడి చేశారు. నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి బృందంపై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పులివెందుల నియోజకవర్గంలోని వేముల తహశీల్డార్ ఆఫీస్‌ వద్ద నీటి సంఘం ఎన్నికలు జరుగుతున్న సమయంలో సాక్షి మీడియా బృందం కవరేజీకి వెళ్ళింది. అయితే, సాక్షి మీడియా ప్రతినిధులపై 50 మంది టీడీపీ మూకలు విచక్షణా రహితంగా రాళ్ళు, కర్రలతో దాడి చేశాయి. దాడిలో సాక్షి రిపోర్టర్లు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములకు తవ్ర గాయాలయ్యాయి. టీడీపీ మూకల దాడిలో కెమెరా కూడా ధ్వంసమైంది.

నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్తుల పై దాడి చేయడం దుర్మార్గమని, దాడికి పాల్పడిన వారిపై హత్యా యత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ డిమాండ్ చేశారు. కవరేజీకి వెళ్లిన సాక్షి టివి కరస్పాండెంట్ శ్రీనివాసులు‌, కెమెరామెన్ రాము , సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గం అన్నారు. అంతేకాక కెమెరాలను, సెల్ ఫోన్‌లను కూడా పగులగొట్టారన్నారు. అనంతరం జర్నలిస్టులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, అలాగే వారిని సురక్షితంగా ఇంటికి పంపాలని పోలీసులను కోరారు.

జర్నలిస్టులపై దాడులకు సంబంధించి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టులకు సంఘీభావంగా ఆందోళనలు చేపడుతున్నారు. జర్నలిస్టు సంఘాలే కాకుండా.. రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, లాయర్లు, డాక్టర్లు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ, షరా మామూలుగానే ఈ నిరసనలు కూడా ఎన్నాళ్లు? మహా అయితే మరో నాలుగైదు రోజులు, మరీ అయితే మరో వారం రోజులు. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. మళ్లీ జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడే జర్నలిస్టుల రక్షణ, భద్రత అనే అంశాలు తెరపైకి వస్తాయి.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com