డబ్బు, హోదా, మంచి పేరు.. ఇవన్నీ ఉన్నవారు ఒక్కసారిగా వీటన్నింటిని వదులుకోవాలంటే ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే చాలా కష్టం.. కానీ వీటన్నింటిని ఒక్కసారిగా వదిలేశాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. అది కూడా అత్యంత కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ ముగియగానే అనౌన్స్ చేశాడు. దీంతో తోటి టీమ్ మేట్స్ మాత్రమే కాదు.. క్రికెట్ ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. నిజానిక టీమిండియాకు ఎన్నో చిరస్మరణ విజయాలు అందించిన అశ్విన్ ఇక టీమిండియా జెర్సీ ధరించడు.. బాల్‌తో ఇక మ్యాజిక్ చేయడు అనే ఆలోచన కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే అశ్విన్ రిటైర్మెంట్ ఓ షాకింగ్ అయితే.. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆ నిర్ణయాన్ని బీసీసీఐ ఎలా గౌరవించింది? అశ్విన్‌కు ఎలా అల్విదా చెప్పింది? అనేది ఇప్పుడు కొత్త వివాదానికి తెర లేపింది.
ఇంత హఠాత్తుగా రిటైర్మెంట్ ఎందుకు?
ఇండియాలో క్రికెట్ అంటే ఓ మతం.. క్రికెటర్ ఓ దేవుడు.. అంత క్రేజ్ ఉంటుంది క్రికెట్‌కు మన దేశంలో. 140 కోట్లకు పైగా ఉన్న మన దేశ జనాభా నుంచి కేవలం ఓ 12 మందిని సెలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. అలాంటి క్రికెట్‌ను అశ్విన్ ఎందుకంత సడెన్‌గా వదిలేశాడు అనేది పెద్ద చర్చగా మారింది. అశ్విన్ రిటైర్మెంట్‌పై ఇద్దరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలపడేలా చేశాయి. అవమానాల వలే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందంటున్నాడు అతని తండ్రి రవిచంద్రన్. ఎవరైనా ఎన్ని రోజులు అవమానాలు ఎదుర్కొంటారన్నాడు. ఆఖరి నిమిషం వరకు రిటైర్మెంట్ గురించి తనకు తెలియదన్నాడు. అయితే తన తండ్రి చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశాడు అశ్విన్. ఇక మాజీ ప్లేయర్ కపిల్ దేవ్ కూడా అశ్విన్ రిటైర్మెంట్‌పై హాట్ కామెంట్స్ చేశారు. అశ్విన్ ముఖంలో ఆవేదన కనిపించిందని, ఆయన సంతోషంగా లేడన్నారు కపిల్. గౌరవప్రదమైన వీడ్కోలుకు ఆయన అర్హుడని… కొన్ని రోజులు వేచి ఉండి, భారత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చని తెలిపారు. అశ్విన్ కు తగిన గౌరవం ఇవ్వాలని కపిల్ అన్నారు. అశ్విన్‌కు బీసీసీఐ ఘనమైన వీడ్కోలు పలకాలన్నారు.
అశ్విన్‌పై బీసీసీఐకు చిన్నచూపు ఉందా?
అశ్విన్‌పై నిజంగానే బీసీసీఐకు చిన్నచూపు ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. కపిల దేవ్ లాంటి దిగ్గజాల వ్యాఖ్యలతో ఇప్పుడిదే చర్చ జరుగుతుంది. మాములుగానే బీసీసీఐలో ఉత్తరాది వారి ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా కీలక పదవుల్లో వారే ఉంటారు. క్రికెటర్లు కూడా ఉత్తరాది నుంచే ఎక్కువగా ఉంటారు. చాలా ఏళ్లుగా నడుస్తున్న చర్చే ఇది. సమాన సామర్థ్యం ఉన్న ఇద్దరు ప్లేయర్లు ఉంటే అందులో ఉత్తరాది వారికే బీసీసీఐ సెలెక్టర్లు ఓటు వేస్తారనే చర్చ ఉంది. ఐపీఎల్ పుణ్యమా అని కొత్త టాలెంట్ గురించి ప్రపంచానికి తెలుస్తుంది కానీ.. లేదంటే చాలా మంది ప్లేయర్స్ ఇప్పటికే కనుమరుగైపోయేవారినిపిస్తోంది. అయితే సెలక్షన్స్‌లో మాత్రమే కాదు.. వారి రిటైర్మెంట్ విషయంలో కూడా బీసీసీఐ పక్షపాతం చూపిస్తుందని ఇప్పుడు తెలుస్తోంది. టీమిండియాకు తన బౌలింగ్‌తో పాటు.. బ్యాటింగ్‌తో కూడా వెన్నెముకగా మారిన అశ్విన్‌కు చాలా సింపుల్‌గా సాగనంపడం చాలా మందికి డైజెస్ట్ కావడం లేదు. ఓ లెజెండరీ ప్లేయర్‌కు ఇదేనా మీరిచ్చే గౌరవం అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మూడో టెస్ట్ ముగిసిన తర్వాత సింపుల్‌గా రిటైర్మెంట్ అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కి చెన్నై చేరుకున్నాడు అశ్విన్. బీసీసీఐ కూడా ఓ పోస్ట్ పెట్టేసి మమ అనిపించేసింది. అదే ఉత్తరాది ప్లేయర్ అయితే ఇలాగే చేస్తారా? అనే ప్రశ్నతెరపైకి వస్తుంది.
అశ్విన్‌కు తగిన గౌరవం దక్కుతుందా?
టీమిండియా ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ముగించుకొని ఇండియాకు చేరుకున్నాకైనా బీసీసీఐ ఈ విషయంపైన ఫోకస్ పెడుతుందా? అశ్విన్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తుందా? అనేది చూడాలి