రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందా? ఆయన ప్రయాణించడానికి ఉపయోగించే కారు ఎందుకు అగ్నికి ఆహుతైంది? ఆయన ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందా? లేక బాంబు దాడి ఏమైనా జరిగిందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ప్రపంచ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రష్యా రాజధాని నడిబొడ్డున ఉన్న ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద ఓ ప్రమాదం జరిగింది. ఆ పేలుడుకు అధ్యక్షుడు ఉపయోగించే ఆరస్ లిమోజీన్ కారు మంటల్లో చిక్కుకుంది. ఇంజిన్‌లో మొదలైన మంటలు క్షణాల్లో కారు మొత్తం వ్యాపించాయి.
పుతిన్ ఈ కారును రెగ్యులర్‌గా వినియోగిస్తారని తర్వాత తేలింది. అలాంటి కారులో ప్రమాదం జరగడం ఇప్పుడు అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. నిజానికి రష్యా అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ మధ్యవర్తిత్వం ఇలా అనేక అంశాలకు ఈ ఘటనను లింక్ చేస్తూ అనేక కథనాలు వినిపిస్తున్నాయి.
రీసెంట్‌గా ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలోనే చనిపోతారని.. ఉక్రెయిన్ -రష్యా యుద్ధం ఆగిపోతుందంటూ ఆయన జోస్యం చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం కూడా తెర వెనక ఏదైనా పుతిన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా? అనే సందేహాలను తెరపైకి తీసుకొస్తోంది.
మాములుగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఆయన భద్రతకు సంబంధించి అమెరికా సీక్రెట్ సర్వీస్‌లాగా బయటికి ఎక్కువగా విషయాలు రాకపోయినా.. పుతిన్ వద్దకు అగంతకులు చేరుకోవడం కష్టమనే చెప్పాలి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనేక వలయాల్లో ఆయన చుట్టూ భద్రత మోహరించి ఉంటుంది.
మరి ఈ కారు ప్రమాదం వెనకున్నది ఎవరు? దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో ఇప్పుడు రష్యా ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.