రోజురోజుకు ప్రపంచంపై తన ప్రభావం, పరపతి పెంచుకుంటూ పోతున్న చైనాలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయా? లేక ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఓ కూటమి తయారవుతుందా? ఇప్పుడీ ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం చైనాలోని కీలక ఆర్మీ జనరల్స్ అయితే అరెస్ట్ అవుతున్నారు.. లేదా తాత్కాలికంగా కస్టడీలోకి తీసుకుంటున్నారు.
ప్రస్తుతం చైనా ఆర్మీలో అత్యంత కీలకమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ హి వైడాంగ్ అరెస్ట్ అయ్యారు. నిజానికి ఈ పదవి చాలా కీలకమైనది. అంతేకాదు చైనా ఆర్మీ జనరల్ లాజిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ మాజీ మంత్రి ఝావో కేషిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు ఆర్మీ అధికారులు. దీంతో చైనా ఆర్మీలో అంతర్గతంగా ఏదో జరుగుతుందన్న ప్రచారం మొదలైంది.
చైనా ఆర్మీలో గత కొన్ని నెలలుగా కీలక మార్పులు జరుగుతున్నాయి. నేవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మిలిటరీ అఫైర్స్ ఇలా అనేక కీలక స్థానాల్లో ఉన్న జనరల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని మాత్రం బయటికి చెప్పడం లేదు చైనా.
వీటన్నింటిలో మరో హైలేట్ ఏంటంటే.. ఫుజియాన్ ఫ్యాక్షన్‌కు చెందిన సీనియర్ జనరల్స్‌ను అదుపులోకి తీసుకోవడం. ఎందుకంటే ఈ ఫ్యాక్షన్ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితమైందిగా భావిస్తారు. అయితే నిజంగానే ఇందులో అవకతవకలు ఉన్నాయా? లేక అధ్యక్షుడు తనకు వ్యతిరేకంగా గొంతు ఎత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.