కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై దాడులు తీవ్రతరం చేశాయి. గత 48 గంటల్లో చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు శ్రీనగర్‌లో శుక్రవారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో కశ్మీర్ ఐజీపీ వీకే బిర్ది కుమార్, విక్టర్ ఫోర్స్ జీఓసీ మేజర్ జనరల్ ధనంజయ జోషి, సీఆర్పీఎఫ్ ఐజీ మితేష్ జైన్ పాల్గొన్నారు. ఐజీపీ బిర్ది కుమార్ మాట్లాడుతూ, కాశ్మీర్‌లో పెరిగిన ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో భద్రతా దళాలు తమ వ్యూహాలను సమీక్షించుకున్నాయని, ఆపై మరింత కసితో ఆపరేషన్లను అమలు చేశామని వెల్లడించారు. అదే సమయంలో రెండు ఆపరేషన్లలో షోపియాన్‌లోని కెలార్, ట్రాల్ ప్రాంతాల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు. ఉగ్రవాద వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించి వేయాలనే లక్ష్యంతో భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
మేజర్ జనరల్ ధనంజయ జోషి ఈ ఆపరేషన్ల వివరాలు వెల్లడించారు. మే 12న కెలార్ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందిన అనంతరం మే 13వ తేదీ ఉదయం వారి ఉనికిని ధృవీకరించుకున్న భద్రతా బలగాలు ముందస్తుగా హెచ్చరించగా, ఉగ్రవాదులు కాల్పులతో ప్రతిస్పందించారని తెలిపారు. ఎదురు కాల్పుల్లో వారు హతమయ్యారని వివరించారు. ట్రాల్ ప్రాంతంలో జరిగిన రెండో ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు వేర్వేరు ఇళ్లలో తాళం వేసుకుని భద్రతా దళాలపై కాల్పులు జరిపారని, అప్పుడు పౌరులను రక్షించడమే పెద్ద సవాలుగా మారిందని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. హతమైన ఆరుగురు ఉగ్రవాదుల్లో షాహిద్ కుట్టే అనే వ్యక్తి ఓ జర్మన్ పర్యాటకుడిపై దాడితోపాటు రెండు కీలక ఉగ్ర దాడుల్లో పాల్గొన్నాడని, నిధుల సమీకరణ చర్యల్లోనూ అతడి పాత్ర ఉందని మేజర్ జనరల్ ధనంజయ జోషి తెలిపారు.