27.9 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

ప్రజాస్వామ్యం ముసుగులో పాకిస్తాన్‌లో ఆర్మీ, ఐఎస్‌ఐ పాలన

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యానికి మరోసారి పరాభవం ఎదురవుతోంది. దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే కేవలం పేరుకు మాత్రమే పాలన చేస్తోందన్న ఆరోపణలకు తాజాగా మరింత బలం చేకూరింది. దేశానికి సంబంధించి కీలక విధానాలు, రహస్య భద్రతా వ్యవహారాలు అన్నీ ఇప్పుడు సైన్యం, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల చేతుల్లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్‌తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ప్రధాన మంత్రికి అసలు ప్రాధాన్యతే లేకుండా పోవడం, ఆయన్ని పూర్తిగా పక్కనబెట్టి సైనికాధిపతులు నేరుగా నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

గత కొన్ని రోజులుగా ప్రధాని షెహబాజ్‌ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించక పోవడం, మీడియాకు దూరంగా ఉండటంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్‌తో ఉద్రిక్తతలపై ఆయనవైపు నుంచి ప్రకటనలేవీ రావడం లేదు. ఇదే సమయంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిఫ్‌ మునీర్‌, ఐఎస్‌ఐ చీఫ్‌ మహమ్మద్‌ అసిమ్ మాలిక్‌లు పలు కీలక సమావేశాల్లో, విదేశీ ప్రతినిధులతో సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా అసిమ్ మాలిక్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడంతో పాక్‌లో మౌనంగా తిరుగుబాటు జరిగిందన్న అభిప్రాయం బలపడుతోంది.

2024 అక్టోబర్‌లో ఐఎస్‌ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మాలిక్‌కు ఇప్పుడు మరో కీలక పదవి అప్పగించడంతో భద్రతా వ్యవస్థ మొత్తం ఆయన చేతుల్లోనే కేంద్రీకృతమైపోయింది. ఇలాంటి నిర్ణయం పాకిస్థాన్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. ఒకే వ్యక్తి ఐఎస్‌ఐ డైరెక్టర్‌గా, జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించడం అంటే.. ప్రజా పాలనపై సైనిక శక్తుల పట్టు మరింత బలపడిందనే సూచనలు వస్తున్నాయి.

పాకిస్థాన్‌ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది అధికార మార్పిడి కాదు, కానీ ప్రజాస్వామ్యం ముసుగులో కొనసాగుతున్న మిలిటరీ పాలనకు తాజా ఉదాహరణ. ఇస్లామాబాద్‌ తనను ప్రజాస్వామ్య దేశంగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, అసలు నియంత్రణ మొత్తం ఆర్మీ-ఐఎస్‌ఐల చేతుల్లోనే ఉందని అంటున్నారు. గతంలోనూ విదేశాంగ విధానం, జాతీయ భద్రత, భారత్‌పై విధానానికి సంబంధించిన అన్ని నిర్ణయాల్లో సైనిక వర్గాలే డామినేట్ చేశాయని గుర్తు చేస్తున్నారు.

2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయిన తరువాత, పాక్ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను పూర్తిగా సైన్యం పూరించింది. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న జాతీయ భద్రతా సలహాదారు స్థానాన్ని ఐఎస్‌ఐ చీఫ్‌కు అప్పగించడం ద్వారా ఆ ఖాళీని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. మిగిలిన రాజకీయ నాయకులు.. ముఖ్యంగా ప్రధాన విపక్ష నేతలు జైలులో ఉండటం వల్ల ప్రజాస్వామ్య పునాదులు మరింత బలహీననపడిపోయాయి.

1947 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌ చరిత్రలో మిలిటరీ తిరుగుబాట్లు, ఆర్మీ ఆధిపత్యం కొత్త విషయం ఏమీ కాదు. నాలుగు సార్లు నేరుగా సైనిక పాలకులు దేశాన్ని పరిపాలించారు. అయితే, ఇప్పుడు ప్రజాస్వామ్యపు ముసుగులోనే సైనికులు పాలన నడిపించడమే ఆందోళనకరమంటున్నారు విశ్లేషకులు. “సాధారణ ప్రభుత్వం ఉన్నట్టే ఉంది. కానీ విధానాలు సైన్యం నిర్ణయిస్తోంది” అన్నది నిపుణుల విశ్లేషణ.

భారత్‌తో ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్‌లో సైన్యం ఈ స్థాయిలో అధికారం చెలాయించడం వర్తమాన దౌత్య రాజకీయాల్లో కీలక పరిణామంగా చెబుతున్నారు. ప్రధాని షెహబాజ్‌ డమ్మీగా మారడంతో, ప్రాంతీయ స్థిరత్వంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు పాకిస్థాన్‌ను ఎవరు నడుపుతున్నారన్న ప్రశ్నకు సమాధానం.. రాజకీయ నేతలు కాదు, మిలిటరీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలే అన్నది ఇప్పుడందరూ అంగీకరించాల్సిన వాస్తవం అని చెబుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com