28.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

డొనాల్డ్ ట్రంప్ రాకతో మారేవి ఇవేనా..?

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వలస విధానం నుంచి మొదలు పెడితే పన్నుల వాయింపు వరకు చాలా అంశాలపై ఆయన చాలా ఘాటుగా స్పందించారు. అందరూ అమెరికాను దోచుకుంటున్నారు అనే కోణంలో ఆయన ఆలోచన ఉంది. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే దానిపై చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ప్రపంచం మొత్తం. ఆయన ఎంట్రీతో మారే కొన్ని అంశాలను చూద్దాం.

ఆర్థిక విధానాలు..
మేక్ అమెరికా గ్రేట్ అగైన్.. ఇదే స్లోగన్‌తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ట్రంప్. దీని కోసం దేనికైనా రెడీ అన్నారు ఆయన. ఇందులో ముఖ్యంగా అమెరికా ఆర్థిక విధానాలను బలపరచాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత డాలర్ మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ డాలర్ బలపడితే చాలా దేశాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు.. చమురు దిగుమతుల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి చమురు ధర పెరిగిందంటే దాని ఎఫెక్ట్ అన్నింటిపై ఉంటుంది.

సిటిషన్‌ షిప్‌ ఇవ్వడంలో మార్పులు..
అమెరికాలో ఎవరు జన్మించినా వారికి ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. కానీ దీనిని తొలగిస్తానని తేల్చి చెప్పారు ట్రంప్. అమెరికన్లకు మాత్రమే ఇకపై ఈ అవకాశం ఉండనుంది. ఇదే జరిగితే అమెరికాలో స్థిరపడిన వారి పిల్లలకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

యుద్దాలు ఆగుతాయా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు యుద్దాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్. ఈ రెండు యుద్ధాలపై భిన్నంగా స్పందించారు ట్రంప్. ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన ట్రంప్.. బందీలను విడుదల చేయకపోతే.. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులను చూడాల్సి వస్తుందంటున్నారు. ఆయన ఇజ్రాయెల్‌కు పూర్తి మద్ధతిస్తున్నారు. ఇక రష్యా-ఉక్రెయిన్‌ యుద్దాన్ని మాత్రం ఆపాల్సిందే అని చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు బిలియన్ డాలర్ల ప్యాకేజీలకు ఇవ్వడం అమెరికాకు ఆర్థిక భారం అని చెబుతున్నారు ఆయన. అంతేకాదు పుతిన్‌తో సమావేశమై చర్చలు కూడా జరుపుతానన్నారు ట్రంప్.

దేశాలపై పన్నుల భారం తప్పదా?
సుంకాల విషయంలో కూడా కఠిన వైఖరితో ఉండబోతున్నారు ట్రంప్. అమెరికా ఎగుమతి చేసే వస్తువులపై భారీగా సుంకాలు వేస్తున్నారని.. ఇకపై ఇది కుదరదంటున్నారు. దేశాలు దిగి రాకపోతే ప్రతీకార సుంకాలు తప్పవని ఇప్పటికే హెచ్చరించారు. మెక్సికో, కెనడా, భారత్, చైనాతో సహా అనేక దేశాలకు ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు.

డ్రాగన్‌తో దోస్తీ కుదురుతుందా?
చైనాతో మాత్రం కయ్యానికే ట్రంప్‌ మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. చైనా ఉత్పత్తులపై పరిమితులు విధించడమే కాకుండా.. పన్నులు కూడా పెంచే అవకాశం పుష్కలంగా ఉంది. మరి దీనిపై చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

వీటితో పాటు అనేక అంశాలపై ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఆలోచన తీరు ఎలా ఉందన్నది పూర్తిగా తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com