రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామసభల్లో ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ సీయం సూచించారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు జరిగే గ్రామసభల నిర్వహణ, ప్రజల స్పందనలపై జిల్లా కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారిలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు దాదాపు రూ.40 వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని వెల్లడించారు. దాదాపు పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నందున ఈ రెండు పథకాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి అనేది నిరంతర ప్రక్రియ అని, గతంలో దరఖాస్తు చేయని వారు ఈ గ్రామ సభలలో ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తు దారుల్లో ఇల్లు లేని వారు, ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారి జాబితా గ్రామ సభలలో తెలియచేయాలని, మరెవ్వరైనా దరఖాస్తు చేసుకోక పొతే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు.
ఇప్పటివరకు రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హులైన వారి జాబితాను ప్రకటించలేదని, అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత అర్హులైన వారిని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం జరిగిన గ్రామ సభలు విజయవంతంగా జరిగాయని, ఇందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు. ఈ నాలుగు పథకాలకు సంబందించి స్వీకరించే దరఖాస్తులలో తప్పనిసరిగా దరఖాస్తుదారుల పేరు, ఆధార్ కార్డు నెంబర్, చిరునామా, ఇంటి అడ్రస్ తదితర వివరాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కాగా మంగళవారం రాష్ట్రంలో 4098 గ్రామాలలో గ్రామసభలను విజయ వంతంగా నిర్వహించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.