తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ప్రతిభ చూపించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇది బ్యాడ్‌న్యూస్. టాప్ ర్యాంకులు సాధించినా, కొత్త నిబంధనల ప్రకారం వారికి కన్వీనర్ కోటాలో సీట్లు దక్కే అవకాశం లేదు. విభజన చట్టం ప్రకారం గత పదేళ్లుగా ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో 15 శాతం సీట్లు లభించేవి. అయితే, పదేళ్ల కాలం పూర్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి నుంచీ కన్వీనర్ కోటాలోని 85 శాతం సీట్లు పూర్తిగా తెలంగాణ స్థానికులకు రిజర్వ్ కాగా, మిగిలిన 15 శాతం అంటే.. నాన్-లోకల్ కోటా సీట్లు కూడా తెలంగాణ మూలాలున్నవారికే పరిమితం చేశారు. అంటే, తల్లిదండ్రులు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులై ఉన్న ఏపీ విద్యార్థులకే ఇకపై ఈ కోటాలో సీటు దక్కే అవకాశముంటుంది. ఇప్పటి వరకు ఏటా 3,500 నుంచి 4,000 వరకు సీట్లు ఏపీ విద్యార్థులకు దక్కుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ అవకాశాలు మసకబారి పోవడంతో తెలంగాణ విద్యార్థులకు మరింత లాభం చేకూరనుంది. పాపులర్ కాలేజీల్లో కటాఫ్ ర్యాంకులు పెరిగే అవకాశం ఉంది.
ఇక, ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు దక్కాలంటే 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడేళ్లలో కనీసం నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలి. ఈ ఆప్షన్ లేని విద్యార్థులను ఇకపై నాన్-లోకల్ గానే పరిగణించనున్నారు. విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో చదివిన విద్యార్థులు ప్రాక్టీస్ కోసమే ఎంసెట్ రాసినా, వారు అడ్మిషన్‌కు అర్హులు కారు. అయితే, ఈ విద్యార్థులలో చాలా మంది జేఈఈ మైన్స్, ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో, ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో కూడా తెలంగాణలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు.