కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాక్ ఇఛ్చింది. భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం ఆదివారం నుంచి అమలులోకి రానుంది. 2023-24 సంవత్సరాని సంబంధించి 9,412 కోట్ల రూపాయలను ఇంధన సర్దుబాటు పేరు మీద వసూలు చేయాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఆదేశించింది. విద్యుత్ వినియోగదారుల నుంచి ఒక యూనిట్ పై 92 పైసల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. ఈ అదనపు ఛార్జీలను డిసెంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 2026వ సంవత్సరం వరకూ వసూలు చేస్తారు. ఈ విద్యుత్ ఛార్జీల అదనపు వసూళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై 7,912 కోట్ల రూపాయల భారం పడనుంది. అయితే ఇంధన సర్దుబాటు పేరు మీద అదనంగా రాబట్టాలనుకున్న 9,412 కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ కింద 1500 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది. వాస్తవానికి ఎన్నికల ముందు టీడీప అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్ధితుల్లో పెంచమని కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ప్రజలకు హామీ ఇచ్చాయి. కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడైతే మరో అడుగు ముందుకు వేసి గతంలో పెంచిన ఛార్జీలను కూడా తగ్గిస్తామని రాష్ట్రమంతా తిరిగి హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాకుండా 9,412 కోట్ల రూపాయల అదనపు భారం మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారనే విమర్శలు చంద్రబాబు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి.
- Advertisement with us -