34.2 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

పార్టీ శ్రేణులకు దూరంగా మంత్రులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే యాక్టివ్ గా ఉంటే సరిపోదు. మంత్రివర్గంలోని అందరు సభ్యులు సమిష్టిగా అడుగులు వేస్తేనే కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గట్టెక్కుతుంది. వన్ మ్యాన్ షో ఇప్పుడు పనికి రాదు. గత ప్రభుత్వంలో జరిగిన లోటు పాట్లు ఈ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏ జిల్లాకు వెళ్లినా అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఖచ్చితంగా సమావేశమవుతున్నారు. కానీ మంత్రులకు మాత్రం తీరిక లేదు. రిబ్బన్ కట్ చేసి జిల్లాల నుంచి వెనుదిరిగి వస్తున్నారు. దీంతో చంద్రబాబు మంత్రుల విషయంలో గత కొన్ని నెలలుగా చేస్తున్న హెచ్చరికలు కూడా పనిచేయడం లేదన్నది తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్న టాక్.

చాలా జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య వైరం తారా స్థాయికి చేరుకుంది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఎమ్మెల్యేలు కూడా ముఖ్యనేతలను, కార్యకర్తలను కలుపుకుని వెళ్లడం లేదు. ఇసుక, మద్యం వంటి వ్యాపారాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఉండి పార్టీ నేతలను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై పార్టీ కేంద్ర నాయకత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. అనేక చోట్ల గ్రూపులుగా విడిపోయి పార్టీ పిలుపు నిచ్చిన కార్యక్రమాలు కూడా వేర్వేరుగా జరుపుకుంటున్నారు. ఈ విషయం మంత్రుల దృష్టికి వచ్చినా పట్టించుకోవడం లేదు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు కానీ, ఆ జిల్లాకు చెందిన మంత్రులు కానీ తమకెందుకు వచ్చిందన్న ధోరణిలో ఉన్నారు.

మరొకవైపు కూటమి నేతల మధ్య కూడా సయోధ్య లేదు. అనేక జిల్లాల్లో విడివిడిగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎవరి జెండా వారిదే. ఎవరి అజెండా వారిదే. ఈ విషయంలోనూ మంత్రులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు పార్టీ అధినేతగా చిన్న విషయాలను సర్దు చాటు చేసే సమయం ఉండదు. వాటిని మంత్రులు దగ్గరుండి సమయం వెచ్చించి కూర్చుని మనసు పెట్టి పని చేస్తే చాలా వరకూ విభేదాలు సమసిపోతాయి. చిన్న చిన్న సమస్యలే అయినా వాటిని పరిష్కరించే వారు లేక మరింత తీవ్రమై గ్యాప్ పెరిగి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా తయారవుతున్నాయి. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండే అవకాశముంది.

మంత్రులకు ఫ్రీ హ్యాండ్ లేదా? అంటే దానికి పార్టీ నాయకత్వం నుంచి ఒకటే సమాధానం వస్తుంది. అసలు సమస్యపై దృష్టి పెడితే కదా? అది తీవ్రమైనదా? లేదా చిన్న సమస్య అని తెలిసేది అని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అసలు ప్రయత్నించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు. గతంలోనూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాలలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ కొంప ముంచాయి. ఇప్పుడు అదే పరిస్థితి టీడీపీలోనూ ఉంది. అందుకే మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు ఈ విషయంలో మంత్రులకు క్లాస్ పీకారని చెబుతున్నారు. ఏదైనా పెద్ద సమస్య ఉంటే తన వద్దకు తేవాలని, చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెబుతున్నా మంత్రులు చెవికి ఎక్కించుకోవడం లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com