హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ భారాన్ని తగ్గించే మరో కొత్త ప్రాజెక్ట్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మిస్తున్న మల్టీలెవల్ ఫ్లైఓవర్ తుది దశకు చేరుకుంది. హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న తొలి మల్టీలెవెల్ ఫ్లైఓవర్ ఇది. ఇప్పటికే కింద రెండు ఫ్లైఓవర్లు ఉండగా.. పైన మూడో ఫ్లై ఓవర్ నిర్మించారు. దీంతో, ఇది మూడు లెవెల్స్‌లో ఉండే ఫ్లైఓవర్‌గా ఇది నిలవనుంది. రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ దాకా విస్తరించి ఉన్న ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారు 1.2 కిలోమీటర్లు, వెడల్పు 24 మీటర్లు. ఎస్‌ఆర్డీపీ ప్రాజెక్ట్ కింద శిల్పా లేఅవుట్ ఫేజ్ 2లో భాగంగా చేపట్టిన ఈ నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయ్యింది. రాత్రి, పగలు తేడా లేకుండా పనులు నిరంతరంయం జరుగుతుండటంతో వచ్చే నెలలో ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధం కానుంది.
ఈ ఫ్లైఓవర్ ప్రారంభం అయితే.. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను నివారించే అవకాశం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే వాహనాలు ఇక రోడ్లపై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఈ ఫ్లైఓవర్ మీదుగా కొండాపూర్ దాకా సునాయాసంగా ముందుకెళ్తాయి. కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల వైపు వెళ్లే వాహనాలకు ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడనుంది.
ఈ మల్టీలెవల్ ఫ్లైఓవర్ విశేషం ఏంటంటే, ఇది మూడు లెవెల్స్‌గా నిర్మించారు. మొదటి స్థాయిలో గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉంటుంది. రెండోస్థాయిలో శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా, వాటి మీదుగా ఇప్పుడు నిర్మించింది ఫేజ్ 2 ఫ్లైఓవర్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణుల సూచనల మేరకు నిర్మించబడిన ఈ ఫ్లైఓవర్ ఒక వెరైటీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.