అమెరికాలో మరో కార్చిచ్చు మొదలైంది. ఈసారి లాస్ఏంజిల్స్ ఈ కార్చిచ్చు ప్రస్తుతం అడవులను దహించి వేస్తోంది. కార్చిచ్చు వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటికే 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నివాస ప్రాంతాల్లో ఇప్పటికే దట్టంగా పొగ కమ్ముకుంది. ఇప్పటికే లాస్ ఏంజిల్స్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పటికే 510 హెక్టార్ల భూమికి అగ్నికి ఆహుతైందని అధికారులు తెలిపారు. మంటలను మరింత విస్తరించకుండా ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నారు.
శాంటి మోనికా, మాలిబు మధ్యలో ఉన్న పసిఫిక్ పాలిసేడ్స్ అనే ప్రాంతం మొత్తం కాలిపోయిందని తెలుస్తోంది. మొదట 10 ఎకరాల విస్తీర్ణంలో కనిపించిన మంటలు చూస్తుండగానే 3 వేల ఎకరాలకు విస్తరించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే శక్తివంతమైన గాలులు మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమవుతున్నాయి.
ముందు ముందు పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉండే హాలీవుడ్ నటులు కూడా ఇప్పటికే తమ ఇళ్లను వదిలి వెళ్లారు. ఇప్పటికే అనేక ఇళ్లు అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు.
ఈ కార్చిచ్చు మొదలుకావడానికి వాతావారణశాఖ హెచ్చరించింది. గురువారం వరకు అప్రమత్తంగా ఉండాలంది. 80 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా పొడిగా ఉండటం.. రీసెంట్గా వర్షం కురవకపోవడం.. తీవ్రమైన గాలులు.. ఇలా అన్ని కూడా మంటలు వేగంగా వ్యాపించేందుకు కారణంగా మారాయని చెప్పొచ్చు.
ఈ కార్చిచ్చుపై అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ట్రక్స్, మంటలను ఆర్పే విమానాలను రంగంలోకి దించుతున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా కార్చిచ్చులు మొదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.