ఇన్నేళ్ల పాటు రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్‌కు చేయాల్సిందంతా చేసింది. గన్‌లు, బుల్లెట్లు, రాకెట్ లాంచర్స్, యుద్ధ విమానాలు, మిసైల్స్, బాంబర్స్, డ్రోన్స్, ఇంటెలిజెన్స్ సమాచారం, దీనికి తోడు ఆర్థిక సాయం.. ఇలా చేయాల్సిందంతా చేసింది అమెరికా. నిజానికి పేరుకు ఉక్రెయిన్ సైనికులు పోరాడుతున్నా.. వెనకుండి నడిపించింది మాత్రం అమెరికానే. బిలియన్ల కొద్ది డాలర్లను కుమ్మరించింది ఉక్రెయిన్‌పై. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీతో సీన్ మారింది. ఇకపై సాయం మాట అటుంచి.. ఇన్నాళ్లు మేం చేసిన సాయానికి ఎలా రుణం తీర్చుకుంటారో చెప్పండి అంటున్నారు ట్రంప్. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది.
గతకొన్ని రోజులుగా అమెరికాకు వ్యతిరేకంగా గొంతు ఎత్తుతున్నారు జెలెన్ స్కీ. అయితే దీనికి ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు తాము చేసిన ఆర్థిక సాయానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్‌లో విస్తారంగా ఉన్న సహజ వనరులను యూఎస్ కంపెనీలకు అందించాలని కోరుతున్నారు ట్రంప్. దీనికి జెలెన్ స్కీ కూడా సానుకూలంగా ఉన్నట్టు మొదట వార్తలు వచ్చాయి. అంతేకాదు భూగర్భ ఖనిజాలను వెలికి తీసేందుకు ఏకంగా 500 బిలియన్ డాలర్ల మేరకు డీల్ చేసుకుందామని ట్రంప్ ప్రతిపాదించారట. ఇక అప్పటి నుంచి జెలెన్ స్కీ స్వరం మారినట్టు కనిపిస్తోంది.
నిజానికి అమెరికా ఏదైనా దేశంలో ఒక డాలర్ ఖర్చు పెడుతుంది అంటే.. దానికి పదింతలు వసూలు చేస్తుంది. లేదంటే ఆ దేశ భూభాగాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటుంది. నిజానికి ఈ విషయంలో భారత్ కొరకరాని కొయ్యగా మారిందనే ట్రంప్ ఇప్పుడు దూకుడు చూపిస్తున్నారు. ఇండియా తటస్థంగా ఉండేందుకే మొగ్గు చూపుతుంది తప్ప.. చెంచాగిరి చేసేందుకు ఒప్పుకోదు. అందుకే ట్రంప్ బెదిరింపుల పర్వం కొనసాగిస్తున్నారు. ఇక ఉక్రెయిన్ విషయానికి వస్తే.. ఆ దేశానికి అమెరికా తప్ప ప్రస్తుతం వేరే దిక్కు కనిపించడం లేదు. యూరోప్ దేశాలు ఎంత ముందుకు వచ్చి సాయం చేయాలనుకున్నా.. వాటి శక్తి సరిపోదు. అందుకే మాటలు తప్ప.. చేతల్లో అంతగా కనిపించడం లేదు. అమెరికాను కాదని యూరప్ దేశాలు ఏదైనా చర్య తీసుకుంటే.. వారి మెడపై డాలర్ కత్తి వేలాడుతూనే ఉంటుంది.
వారిద్దరూ కలవాల్సిందే అంటున్న ట్రంప్..
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగాలంటే జెలెన్ స్కీ-పుతిన్ భేటీ కావాల్సిందే అంటున్నారు ట్రంప్. అప్పుడు లక్షలాది మంది చావులు ఆగుతాయని చెబుతున్నారు. మొత్తానికైతే ఈ యుద్దాన్ని ఆపిన క్రెడిట్ తనదే అని చెప్పకనే చెబుతున్నారు ట్రంప్. ఏదేమైనా అమెరికాను నమ్మి ఏదైనా చేస్తే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసుకోవడానికి ఉక్రెయిన్ పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఈ యుద్ధం ప్రారంభమవడానికి కారణం అమెరికా.. ఇప్పుడు ఆగిపోవడానికి కారణం అమెరికా.. దీనికి ప్రతిఫలంగా ఇప్పుడు ఉక్రెయిన్ తమ దేశంలో ఉన్న సహాజ వనరుల నిక్షేపాలను అమెరికాకు కట్టబెట్టాల్సిన పరిస్థితి. అట్లుంటది మరి అమెరికాతో.