అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు స్మార్ట్‌గా ఆలోచించేవాళ్లు, స్మార్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు అమెరికాకు అవసరం ఉన్నారని వ్యాఖ్యానించారు.తెలివైన వ్యక్తులు అమెరికాకు రావాలని యూఎస్ కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. హెచ్1బి వీసాల అంశంపై అమెరికాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఈ అంశంపై స్పందించారు. అమెరికాకు సమర్థవంతులైన వాళ్లు రావాలని, కావాలని తాను ఎప్పుడూ భావిస్తుంటానని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
అమెరికాకు సమర్థత కలిగిన వ్యక్తులు అవసరమని, అలాంటివాళ్లు రావాలని, కావాలని నేను ఎల్లప్పుడూ భావిస్తానన్నారు. తెలివైనవారు మన దేశానికి రావాలని ఆకాంక్షించేవారిలో తాను ముందుంటానన్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అమెరికాలో ఉద్యోగాలు రాబోతున్నాయని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఏర్పాటుచేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE)కి సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి గతంలోనే ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అమెరికా తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్‌లను తయారుచేస్తోందని, అందుకే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం కలిగిన వాళ్లను యూఎస్‌లోకి అనుమతించడానికి హెచ్1బీ వీసా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతిభ ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటిస్థానంలో ఉండాలంటే ఈ ప్రోగ్రాంకు మద్దతివ్వాలని కోరారు.
ఎలాన్ మస్క్ కూడా హెచ్1బీ వీసాతోనే అమెరికాకు వలస వచ్చారు. అయితే, వారి వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ 1బీ వీసా కార్యక్రమాన్ని రక్షించుకునేందుకు తాను యుద్ధానికైనా దిగుతానని మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉంటే.. తాను ఎల్లప్పుడూ హెచ్1 బీ వీసాలకు అనుకూలంగా ఉంటానని, అందుకే తమ దేశంలో ఆ వీసాలు ఉన్నాయని ఇటీవల ట్రంప్ నుంచి కూడా మద్దతు దొరికింది. నూతన సంవత్సరం వేళ ఇప్పుడు మరోసారి అదేతరహా స్పందన వచ్చింది.
తమ ప్రభుత్వం చివరి దశలో.. కొద్దిరోజుల్లోనే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న సమయంలో బైడెన్ సర్కారు ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక నిపుణులైన విదేశీయులను మరింత తేలికగా తమదేశంలో నియమించుకొనేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ పలు నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతోపాటు సులువుగా ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకొనే అవకాశం కల్పించింది. ఇది లక్షల మంది భారతీయ నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది. ఈ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకొంటుంటాయి.