డాలర్ డ్రీమ్స్ కోసమంటూ, ఉపాధి కోసమంటూ, అవకాశాల కోసమంటూ అమెరికా వెళ్లిన వాళ్లను అక్రమ వలసదారులుగా ముద్రవేసి భారత్‌కు వెనక్కి పంపిస్తోన్న అమెరికా తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నరేంద్రమోదీకి ఫ్రెండ్‌గా చెప్పుకునే అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ చెప్పేదొకటి.. చేసేదొకటి.. అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో కలలతో, ఆశలతో వెళ్లిన వాళ్లకు సరైన దిశా నిర్దేశం చేయకుండా.. ఓ ముద్రవేసి వెనక్కి పంపించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా మౌనముద్ర వహించడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి విడత విమానం భారత్‌కు చేరుకోగా.. మిగతా వాళ్లనైనా అక్కడే ఉండేలా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.
తొలి విడతలో టెక్సాస్ నుంచి 104 మందితో కూడిన అమెరికా సైనిక విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వారిలో పంజాబ్ వాసులు 30 మంది ఉండగా, హరియాణా వాసులు 33 మంది, గుజరాత్ వాసులు 33 మంది, మహారాష్ట్ర వాసులు ముగ్గురు, ఉత్తరప్రదేశ్ వాసులు ముగ్గురు, ఛండీగడ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. మొదట ఈ సైనిక విమానంలో భారత్‌కు తిరిగొస్తున్న వాళ్ల సంఖ్య 205 మంది అని ప్రకటించినా.. తిరిగొచ్చిన వాళ్లు మాత్రం 104 మాత్రమే అంటున్నారు.
అమెరికాలోని హోమ్‌లాండ్ అధికారులు రూపొందించిన లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయులు అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నారని గుర్తించారు. వారిలో 17,940 మందిని వెనక్కి పంపించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ అయ్యాయని చెబుతున్నారు. వీరిలో మొదటి విడతలో 104 మందిని భారత్‌కు పంపించారు.
అయితే, ఇప్పుడు అక్రమ వలసదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు.. ఉగ్రవాదులు కాదు. నేరస్తులు కాదు. కేవలం అమెరికా ఆశలతోనే అష్టకష్టాలు పడి అక్కడికి వెళ్లారు. వారిలో కొందరి వీసాలు, అనుమతి పత్రాల గడువు ముగిసిపోగా.. మరికొందరు ఏజెంట్ల మోసాల కారణంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి అడుగుపెట్టారు. అంతేకాదు.. తమ వాళ్లు నిబంధనల ప్రకారమే వెళ్లారని, ఎంతో కష్టపడి కలలు నిజం చేసుకునేందుకు ఆస్తులు అమ్ముకొని, అప్పులు చేసి అమెరికా వెళ్లారని, ఎవరో చేసిన పొరపాట్లకు వీళ్లు బలవుతున్నారని బాధితుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వాళ్లకు అవసరమైన డాక్యుమెంట్లు రెన్యువల్ చేయించేలా, మిస్అయిన పత్రాలు ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు కోవాలని కోరుతున్నారు. అగ్రరాజ్యంలో ఉపాధి, ఉద్యోగంపై గంపెడాశలతో వెళ్లిన వాళ్లకు సరైన పత్రాలు మంజూరు చేయించి.. భారత ప్రభుత్వం వాళ్ల కలలను సార్థకం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అమెరికాకు ఉపాధి కోసమంటూ వెళ్లి.. ఇప్పుడు తిరిగొచ్చిన వాళ్లు ఆర్థికంగా కూడా తీవ్ర కష్టాలు ఎదుర్కోనున్నారు. ఎందుకంటే అమెరికాకు వెళ్లేందుకు వాళ్లు భారీమొత్తంలో అప్పులు చేశారు. తమ ఆస్తులు అమ్ముకొని మరీ యూఎస్ వెళ్లారు. ఇప్పుడు రిక్త హస్తాలతో తిరిగొస్తే.. ఆ అప్పుల పరిస్థితి ఏంటని తిరిగొచ్చిన బాధితులే కాదు.. వాళ్ల కుటుంబసభ్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. మానవతా హృదయంతో ఆలోచించి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే గుర్తించిన వాళ్లను కూడా తిరిగి పంపించకముందే వాళ్లకు అవసరమైన పత్రాలు అందేలా చొరవ చూపించాలని బాధితుల కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.