హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. మహా శివరాత్రి పర్వదినం నాడు అంబర్పేట్ ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తెల్లవారు జామున ఐదు గంటల నుంచే అంబర్ పేట్ ఫ్లై ఓవర్ మీదుగా వాహనాల రాకపోకలు మొదలయ్యాయి.
గోల్నాక నుంచి ఛే నంబర్ జంక్షన్ మీదుగా హోటల్ వరకు ఈ ఫ్లై ఓవర్ నిర్మించారు. అంబర్ పేట్ ఫ్లై ఓవర్ మీదుగా వాహనాలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన మొట్టమొదటి ఫ్లైఓవర్ ఇదే. నాలుగేళ్లుగా కొనసాగుతున్న పనులు పూర్తయి వాహనాలకు అనుమతి ఇవ్వడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు రూ.445 కోట్ల నిధులతో 1.625 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో నేషనల్ హైవే అథారిటీ ఈ ఫ్లైఓవర్ నిర్మించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినప్పటికీ భూ సేకరణకు టూ బై థర్డ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మొత్తంగా రూ.180 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చుకాగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్లు ఇచ్చింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి 2018లో శంకుస్థాపన చేయగా, 2021లో పనులు మొదలు పెట్టారు. 2023 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా పలు కారణాలతో ఆలస్యమయింది.