సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని శనివారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదల చేశారు. ఉదయమే ఆరుగంటలకు ఎస్కార్ట్ పోలీసులు అల్లు అర్జున్ని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయంలో దించి వెళ్లిపోయారు. అనంతరం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి తన నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్
అల్లు నివాసంలో ఉద్విగ్న వాతావరణం
ఒక రాత్రి చంచల్ గూడ జైల్లో గడిపి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ని చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా ఆయన భార్య, పిల్లలు ఇద్దరూ అల్లు అర్జున్ని కౌగిలించుకుని కంటనీరు పెట్టుకున్నారు. ఇక అర్జున్ తల్లి, తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు పెద్దయెత్తున అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని అతనికి స్వాగతం పలికారు. ఇంటి పెద్దలు అల్లు అర్జున్ కి దిష్టి తీసి ఇంటిలోపలికి ఆహ్వానించారు.
నేను చట్టాన్ని గౌరవిస్తాను
అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన పట్ల తన అభిమానులు ఎవ్వరూ ఆందోళణ చెందవద్దని సర్ధిచెప్పారు. నేను చట్టాన్ని గౌరవిస్తానని తెలిపారు. నిన్నటి నుంచి తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంధ్యా ధియేటర్ దుర్ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబనికి సానుభూతిని ప్రకటించారు. కోర్టు పరధిలో కేసు ఉన్నందున న్యాయస్ధానాన్ని గౌరవిస్తూ తాను ఇప్పుడు ఏమీ మాట్లాడలేనని అల్లు అర్జున్ మీడియాతో అన్నారు.