పహల్గామ్‌లో ఉగ్రవాదులు సాగించిన మారణ కాండ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆపరేషన్ సిందూర్ తర్వాత మరింత తీవ్రరూపం దాల్చాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పహల్గామ్‌లో ముష్కర మూకల ఆగడాలకు భారత సైన్యం అదను చూసి బుద్ధిచెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌తో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఏక కాలంలో మట్టుబెట్టింది. సుమారు వంద మంది ఉగ్రవాదులు ఈ మెరుపు దాడుల్లో హతమయ్యారు. వాళ్ల అడ్డాలన్నీ శిథిలాలుగా మారిపోయాయి.
ఈ పరిణమాలతో షాక్ తిన్న పాకిస్తాన్ కుటిల పన్నాగాలకు తెర లేపింది. ఆపరేషన్ సిందూర్‌తో భారత గగనతలంలోకి అడుగు పెట్టకుండానే.. భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని టెర్రరిస్ట్ క్యాంపులను లేపేసింది. కేవలం ఉగ్రవాదాలు, ఉగ్రవాద శిబిరాలే టార్గెట్‌గా ఈ ఆపరేషన్ చేపట్టింది. కానీ, పాకిస్తాన్ మాత్రం ప్రతీకార దాడుల పేరుతో అర్థం పర్ధం లేని దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న భారత్‌లోని పలు సైనిక స్థావరాలపై గురి పెట్టింది. 15 సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించగా.. భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీంతో, భరించలేని పాకిస్తాన్.. ఇక తాజాగా జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. అయితే, పాకిస్తాన్ దుష్ట పన్నాగాల గురించి తెలిసిన భారత సైన్యం ప్రత్యర్థి డ్రోన్లు, రాకెట్లను సమర్థవంతంగా అడ్డుకొని కూల్చివేసింది. ఈ నేపథ్యంలో జమ్ము నగరం మొత్తం విద్యుత్ అంతరాయం ఏర్పడింది. శత్రు సేనల నుంచి ప్రయోగించిన డ్రోన్లను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో భారత సైన్యం కూల్చివేసింది. కొన్ని రాకెట్లను కూడా కూల్చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రతను పెంచింది. ఢిల్లీ, హర్యానా, బెంగాల్ రాష్ట్రాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసులు, పాలనాధికారులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులు రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు, అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి.. స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లోనూ భారీగా భద్రత ఏర్పాటు చేసింది. హమీపుర్, ఉనా, బిలాస్‌పుర్ భద్రతను పెంచింది. వీటితో పాటు సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలను ముమ్మరం చేసింది. దేశంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరికలు జారీ చేసింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని, అనవసరంగా బయటకు రావొద్దని సూచనలు జారీ చేసింది. పాక్ సరిహద్దుల్లో కీలక ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో పూర్తిగా యుద్ధవాతావరణం నెలకొంది. ముఖ్యంగా జమ్ము, రాజోరీ, ఉధంపూర్, శ్రీనగర్ ప్రాంతాలను చీకట్లు కమ్ముకున్నాయి. జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ వేసిన మిసైల్స్‌ను భారత సైన్యం ఆకాశంలోనే పేల్చేసింది.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో బోర్డర్‌కు దగ్గరగా ఉన్న జిల్లాల్లో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రత్యేక నిఘా, బ్లాకౌట్‌లు అమలు చేస్తోంది. ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, అమృత్‌సర్, గుర్దాస్‌పూర్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.