త్వరలో తెలంగాణ రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్ల ద్వారా మద్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు మెక్‌డోవెల్స్ కంపెనీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను కూడీ ఈవిధంగా టెట్రా ప్యాక్ చేసి అమ్మాలని భావిస్తున్నారు. 60ఎంల్, 90ఎంఎల్, 180ఎంఎల్ ప్యాకెట్లుగా విక్రయించడానికి సిద్దం అవుతున్నారు. తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ టెట్రా ప్యాక్ మద్యాన్ని ప్రయోగాత్మకంగా విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే కర్నటక రాష్ట్రంలో ఈ తరహా టెట్రా ప్యాక్ మద్యాన్ని విక్రయిస్తు్న్నారు. కర్నాటకలో మెక్‌డోవెల్స్ నంబర్ వన్ కంపెనీ తన మద్యం విక్రయాలలో 90 శాతం టెట్రా ప్యాకెట్లలోనే అమ్మకాలు చేస్తు్న్నారు. సీసాల్లో దొరుకుతున్న మద్యం కంటే టెట్రా ప్యాకెట్ల ధర తక్కువగా ఉంటుందని చెపుతున్నారు. ప్రస్తుతం క్వార్టర్ చీప్ లిక్కర్ ధర రూ.120గా ఉండగా, టెట్రా ప్యాకెట్లలో అది రూ.100కే లభించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనూ అదే తరహాలో మద్యం విక్రయానికి మెక్‌డోవెల్స్ కంపెనీ ముందుకొచ్చింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి తీసుకురావడానికి మెక్‌డోవెల్స్ కంపెనీ సిద్దంగా ఉంది. ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులు రెండుసార్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను కలిసి టెట్రా ప్యాకెట్ల వల్ల ఖర్చు తగ్గడంతోపాటు ప్రభుత్వానికి, వినియోగదారులకు, కంపెనీకి కలిగే ప్రయోజనాలను వివరించారు. టెట్రా ప్యాకెట్లపై ప్రజల్లో స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ టెట్రా ప్యాకెట్లను విక్రయించాలని భావిస్తు్న్నట్లు సమాచారం. కాగా, తెలంగాణలో మొత్తం 2,620 వైన్ షాపులు, 1,117 వరకు బార్లు ఉన్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతోంది..