24.8 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వాయుసేన గ్రీన్ సిగ్నల్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు, తెలంగాణ ప్రజలందరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయతలపెట్టిన పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన (IAF) అంగీకారం తెలిపినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకుముందు మామునూర్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు.. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు సాధించడంపట్ల ఆయన హర్షంవ్యక్తం చేశారు. ఆరు నెలల స్వల్పవ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

అదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు (లేఖ సంఖ్య: 5608/ఎయిర్ పోర్ట్స్/2024, తేదీ: 18.12.2024) భారత వాయుసేన (IAF) వాయుసేన అధికారులు.. సముఖతవ్యక్తం చేయడంతో పాటు.. అక్కడ భవిష్యత్తులో వాయుసేన శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు లేఖలో తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వానికి పౌర విమాన సేవలను ప్రారంభించేందుకు కావాల్సిన అనుమతులు మంజూరీ చేస్తున్నట్లు వాయుసేన అధికారులు లేఖ ద్వారా తెలిపినట్టు ఆయన వివరించారు.

ఈ విమానాశ్రయాన్ని పౌర విమానయానానికి మరియు ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్టు తెలిపిన మంత్రి.. పౌర విమానాల రాకపోకలకు అనువుగా రన్‌వే పునర్నిర్మాణం చేయడం, పౌర టర్మినల్ ఏర్పాటు, ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్రాన్ (విమానాలు నిల్చోవడానికి, మలుపులు తిరగడానికి మరియు ఇతర విమానయాన కార్యకలాపాలకు ఉపయోగించే నిర్దిష్ట ప్రాంతం) వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి పనులు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కు సమకూర్చుకోవాలని వాయుసేన అధికారులు లేఖలో సూచించినట్టు మంత్రి తెలియజేశారు.

అంతేకాదు, ఎయిర్ పోర్ట్ కు అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిటెయిల్డ్ ప్రపోజల్స్ ను భారత వాయుసేనకు సమర్పించాలని కోరినందున అందుకు సంబంధించిన తదుపరి కార్యాచరణను అధికారులతో సమీక్షిస్తున్నామని అతిత్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను రూపొందించి కేంద్రానికి, సంబంధిత విభాగాలకు సమర్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో మొన్న మామునూర్, నేడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులకు అనుమతుల మంజూరీలో సహకరిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, రాష్ట్రంలో ఏయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు అండగా నిలబడుతున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com