37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

రాజకీయాల్లోకి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ – ప్రయోజనాలు, సవాళ్లు, సక్సెస్‌ అయిన నేతలు

ఏఐ. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌. ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేస్తోంది. ముఖ్యంగా ఉత్పాదక రంగాల్లో, టెక్నాలజీ రంగాల్లో, నైపుణ్య రంగాల్లో ఈ కృత్రిమ మేథ ఇప్పటికే చొచ్చుకొచ్చింది. మనం ఇచ్చే కమాండ్‌లతో మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ను క్షణాల్లో చేసి మన కళ్లముందుంచుతోంది. ఒక మనిషి కొన్ని గంటలపాటు చేయగలిగిన పనిని కొద్ది సెకనులలోనే తయారుచేసి పెడుతోంది. ఫలితంగా.. ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌.. మ్యాన్‌పవర్‌పై ఊహించని రీతిలో ప్రభావం చూపిస్తోంది.

అయితే, ఇప్పుడు పాలిటిక్స్‌లోకి కూడా ఏఐ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిందనడం కంటే.. పొలిటికల్‌ లీడర్స్‌ తమ వ్యూహాలు, మేనిఫెస్టోలు, ప్రచార పర్వాల్లో రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఏఐ చేరుకుంటోంది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో కీలకమైన పాత్ర పోషిస్తోన్న నేటియుగంలో.. ఆధునిక టెక్నాలజీలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పటికే మన జీవితంలో అనేక మార్పులను తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధి చెందడం, రాజకీయ ప్రచారాల్లో కూడా అనేక మార్పులను తీసుకొస్తోంది. రాజకీయ రంగంలోనూ ఈ సాంకేతిక పరిజ్ఞానం తన పరిధిని విస్తరించింది. ఏఐ ఇప్పుడు రాజకీయాల్లో నాయకులకు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కూడా వాహకంగా మారుతోంది. కావాల్సింది వేగంగా కళ్లముందుంటోంది. ఫలితంగా సమయం చాలా వరకు ఆదా అవుతోంది. గతంలో కంటే ఆర్థిక సంబంధ ఖర్చులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. అంతేకాదు.. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో రూపొందిస్తున్న ప్రచార సామాగ్రి, ఇమేజ్‌లు, వీడియోలు, క్రియేటివ్‌లు ప్రజలను ముఖ్యంగా ఓటర్లను కూడా ఆకర్షిస్తున్నాయి.

రాజకీయ ప్రచారంలో ఏఐని వాడుకుంటున్న నాయకులు.. ఆ సాంకేతికతను ఎన్నికల వ్యూహాల్లో చేర్చుకుంటున్నారు. ఓటర్ల ప్రవర్తనను అర్థం చేసుకోవడం, ప్రచార వ్యూహాలను సిద్ధం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్ మెరుగుపరచడం వంటి అంశాల్లో ఏఐని ముఖ్య పాత్ర పోషించేలా వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో అధికారిక పార్టీలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో ఏఐ టూల్స్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఏఐ వినియోగంలో కేజ్రీవాల్‌ ముందడుగు :

ఇక, ఇప్పుడు ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌ మరింత ముందడుగు వేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌లోకి సరికొత్త పంథాని చొప్పించారు. తన ప్రచారంలోకి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను తీసుకొచ్చారు. అంబేడ్కర్‌ సజీవంగా వచ్చి తనను ఆశీర్వదించినట్లు ప్రచార వీడియో రూపొందించుకున్నారు. రెండు రోజుల క్రితం పార్లమెంటులో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌పార్టీ గగ్గోలు పెట్టింది. అయితే, కేజ్రీవాల్‌ ఆ స్థాయిలో రగడ సృష్టించనప్పటికీ సైలెన్స్‌గా అంతకుమించిన పొలిటికల్‌ స్ట్రాటజీని రూపొందించుకున్నారు.

ఇండియాగేట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ వీడియోను తయారు చేశారు. ఆ వీడియోలో అంబేడ్కర్‌ నీలిరంగు దుస్తులు ధరించి ఉన్నారు. ‘నాకు బలాన్ని ఇవ్వండి బాబా సాహెబ్‌, మీ రాజ్యాంగాన్ని అవమానించే వారితో నేను పోరాడగలను’ అని కేజ్రీవాల్‌ వాయిస్‌ ఉంటుంది. అంబేడ్కర్‌ కేజ్రీవాల్‌ తలను నిమురుతూ ఆత్మీయంగా ఆశీర్వదిస్తున్నట్లు ఆ వీడియోను రూపొందించారు. అంబేడ్కర్‌ నిజంగా, సజీవంగా వచ్చారా? అన్నట్లుగా ఆ ఏఐ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు. ఆప్‌ సోషల్‌ మీడియా టీమ్‌ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ వీడియోకు కేజ్రీవాల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో సోషల్ మీడియాలోకి వచ్చేసింది.

ఏఐని రాజకీయాల్లో వాడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఏఐ వల్ల ఎదురయ్యే సవాళ్లు.. అలాగే, ఇప్పటిదాకా వీటిని ఉపయోగించుకొని సక్సెస్‌ అయిన శక్తివంతమైన రాజకీయ నాయకుల వివరాలు ఓసారి చూద్దాం…

ఎన్నికల వ్యూహాలలో విప్లవాత్మక మార్పులు :
1. ఓటర్ల ప్రవర్తన విశ్లేషణ :

– ఏఐని వాడుకోవడం వల్ల రాజకీయ పార్టీలు ఓటర్ల అభిరుచులను, గతంలో జరిగిన ఓటింగ్ రహస్యాలను సులభంగా అంచనా వేయగలిగే సామర్థ్యం కలుగుతోంది. రాజకీయ నాయకులు ప్రత్యక్ష ప్రచారంలో ఎదురవుతున్న అనుభవాలు, ఓటర్ల నుంచి వస్తున్న సవాళ్లను అంచనా వేస్తూ ఏఐ ద్వారా పరిష్కార మార్గాలకు దారులు వేసుకోవడం వీలవుతోంది. ఏఐని ఉపయోగించడం ద్వారా.. సోషల్ మీడియా ప్రిడక్టివ్‌ మోడల్స్‌ను ఉపయోగించి, ఆధునిక సవాళ్లు, ప్రజల ఆలోచనలను తెలుసుకొని, ఆ సమాచారాన్ని ప్రచార వ్యూహాలకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.

2. కస్టమైజ్డ్ ప్రచారం :

– ఏఐ ద్వారా, రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా ఓటర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రచారాలను కస్టమైజ్ చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ఈ ప్రక్రియలో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్-NLP టెక్నాలజీ సహాయంతో ప్రజల భాషలో, వారి సమాజం, సంస్కృతి, ప్రభావానికి అనుగుణంగా ప్రకటనలను రూపొందించుకోవచ్చు. ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ యాడ్స్ ద్వారా ప్రచార సరళిని సులభతరం చేసుకోవచ్చు.

3. ఇన్నోవేటివ్ సోషల్ మీడియా వ్యూహాలు :

– సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకునే ప్రచార వ్యూహాలు ఇప్పుడు ఏఐ ఉపయోగం ద్వారా ఎక్కువవుతున్నాయి. ప్రధానంగా డిజిటల్ ప్రొఫైలింగ్ ద్వారా ఓటర్లు, వారి ఆలోచనలు, అభిరుచులు మరియు ప్రవర్తనల ఆధారంగా ఎలక్ట్రానిక్ ప్రచారం నిర్వహించుకోవడం వల్ల ఆయా పార్టీలకు ప్రయోజనం చేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక, మొబైల్ యాప్స్, సోషల్ మీడియా, డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి, ప్రజలకు కస్టమైజ్డ్ మెసేజెస్ పంపడం వాళ్లతో నేరుగా సంబంధాలను మెరుగు పరిచే అవకాశాలు కలుగుతాయి.

4. సమాచారం ఆధారిత ప్రచారం :

– ఏఐ ద్వారా గుర్తించే డేటా విశ్లేషణతో అభ్యర్థులు, తాము పోటీ చేస్తున్న ప్రాంతంలో సమాజానికి ఏం అవసరమో, ఏ సమస్యలు ముఖ్యమో అర్థం చేసుకోగలుగుతారు. సోషల్‌ మీడియాలో ఆంక్షలు, ప్రజల అవగాహన, అభిప్రాయాలు, ఫేక్ న్యూస్ ఎదుర్కోవడం వంటి అంశాలను సమర్థవంతంగా అంచనా వేసి, వాటికి అనుగుణంగా ప్రచారం చేయడం వీలవుతుంది.

ఏఐతో సక్సెస్‌ అయిన ప్రముఖ నాయకులు :
1. నరేంద్ర మోదీ (భారత ప్రధాన మంత్రి):

– భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 ఎన్నికల్లో ఏఐ ఆధారిత ప్రచారాలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు విరివిగా వినియోగించుకున్నారు. అయితే, ఈ పరిణామం ప్రపంచ దేశాలు, కొన్ని సంస్థలకు పరోక్షంగా ఉపయోగపడింది. ప్రత్యేకంగా, నరేంద్రమోదీ ప్రచార సరళి, ప్రజల ఆలోచనా విధానాన్ని గమనించి, సోషల్ మీడియా ద్వారా భారతీయ ప్రజల అభిప్రాయాలు విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకున్నాయి. వాస్తవానికి 2014, 2019 ఎన్నికల సమయంలో కూడా నరేంద్రమోదీ సోషల్ మీడియాకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ.. 2019, ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఏఐకి సాధారణంకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా పొలిటికల్ ప్రచార వ్యూహాలు రూపుదిద్దుకున్నాయి.

2. డొనాల్డ్ ట్రంప్ (అమెరికా కాబోయే అధ్యక్షుడు):

– డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల్లోనూ, మొన్నటికి మొన్న జరిగిన 2024 ఎన్నికల్లోనూ సోషల్ మీడియా ద్వారా తనదైన రీతిలో చేసిన ప్రచారంతో అమెరికన్‌ ఓటర్లను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా వంటి డేటా విశ్లేషణ కంపెనీలతో ట్రంప్ టీమ్‌ క్యాంపెయిన్ చేసింది. తాము విశ్లేషించిన డేటాను ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో కస్టమైజ్డ్ యాడ్స్ కోసం ఉపయోగించటం, ప్రజల టెంపరరీ రెస్పాన్స్‌కు అనుగుణంగా వాటిని రూపొందించటం, ట్విట్టర్ ద్వారా వ్యక్తిగతంగా తమ మెస్సేజ్‌లను ఓటర్లకు నేరుగా చేరవేయడం ప్రధాన ఆలోచనలుగా కనిపించింది.

రాజకీయ ప్రచారంలో ఎదురయ్యే సవాళ్లు :
1. డేటా గోప్యత :

– ఏఐ డేటాను చాలా విస్తృతంగా సేకరిస్తున్నప్పుడు, ప్రజల ప్రైవసీకి ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉంది. డేటా లీకేజీలు, అప్‌డేటెడ్‌ డేటా దుర్వినియోగం కావడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

2. ఫేక్ న్యూస్ :

– ఏఐ అనేక సందర్భాల్లో ఫేక్ న్యూస్‌ను కూడా గుర్తించకుండా ప్రచార మెటీరియల్‌ను అందించే ప్రమాదం పొంచి ఉంది. అలాగే, డేటా కూడా అప్‌డేట్‌ కాకపోతే.. అవుట్‌డేటెడ్‌ మెటీరియల్‌ చేతికందుతుంది. ఒకవేళ.. క్రాస్‌చెక్‌ చేసుకోకపోతే ఇది ఎన్నికలలో ప్రజల అభిప్రాయాలపై ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది.

3. అధిక ఖర్చు :

– ఏఐ ఆధారిత ప్రచారాలను నిర్వహించడం చాలా ఖరీదయిన ప్రక్రియగా మారవచ్చు, దీనివల్ల చిన్న పార్టీలు, మామూలు అభ్యర్థులకు ఇది పెద్ద భారంగా మారే అవకాశం ఉంది.

రాజకీయ ప్రచారాల్లో ఏఐ కారణంగా.. ఓటర్ల ప్రవర్తన విశ్లేషణ, కస్టమైజ్డ్ ప్రచారాలు, సోషల్ మీడియా వ్యూహాలు ఇలా ఎన్నో కొత్త మార్పులు తీసుకొచ్చింది. రాజకీయ నాయకులు, పార్టీలు ఏఐని తమ ప్రచార వ్యూహాల్లో ఉపయోగించి ప్రజలకు సమర్థవంతంగా తమ ఆలోచనలను తెలియజేయగలుగుతున్నారు. అయితే, ఈ సాంకేతికతతో సవాళ్లు కూడా ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రైవసీ, సోషల్ మీడియాలో సునిశితంగా వ్యవహరించడం మరింత అవసరం. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయాల భవిష్యత్తు రూపురేఖలు మార్చేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఒక శక్తివంతమైన సాధనంగా మారబోతోందనడంలో అతిశయోక్తి లేదు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com