కూటమి ప్రభుత్వానికి కానీ.. తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే భయమో..? బలహీనతో.. ? ఉన్నట్టే కన్పిస్తోంది. ఇంకొంచెం డీటైల్డుగా చెప్పాలంటే చంద్రబాబుకు పవన్ అంటే భయం కానీ.. బలహీనత కానీ ఉందనే చర్చ ఏపీ రాజకీయ.. పరిపాలనా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మిత్రపక్షంగా పవన్ కళ్యాణుకు రాజకీయంగా.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు డెప్యూటీ సీఎం హోదాలో పరిపాలనా పరంగా పవనుకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే.. కానీ మరీ పద్దతులు.. ప్రొటోకాల్.. నిబంధనలకు విరుద్దంగా పవన్ కళ్యాణుకు ప్రియార్టీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
ఏదైనా సమావేశానికి.. అది కలెక్టర్ల కాన్ఫరెన్స్ కావచ్చు.. కెబినెట్ మీటింగ్ కావచ్చు.. తాను రావాలనుకుంటే వస్తారు.. లేకుంటే లేదు. ఇదీ పవన్ కళ్యాణ్ స్టైల్. ఇదే మిగిలిన మంత్రులు చేస్తే.. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ఊరుకునే వారా..? అంటే లేదనే అంటారు. అయితే మిగిలిన మంత్రులకు.. పవన్ కళ్యాణుకు తేడా లేదా.. అనే వారు ఉన్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో.. అందులోనూ రాజకీయంగా పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి.. ఇలాంటి వాటి విషయాల్లో చంద్రబాబు చూసీ చూడనట్టుగా ఉండొచ్చు. ఇక వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద చంద్రబాబు.. ప్రభుత్వం లైనుకు విరుద్దంగా మాట్లాడుతున్నా.. అది ఇబ్బందులను సృష్టిస్తున్నా.. సర్లే.. కానీలే అంటూ చూసీ చూడనట్టు పోతున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన ఓ ప్రారంభోత్సవం మాత్రం అత్యంత వివాదస్పదం అయింది. పవన్ కళ్యాణ్ తన దక్షిణ భారత దేశ పర్యటనలో భాగంగా పళని వెళ్తే.. అక్కడి వారు తిరుపతికి బస్ కావాలని అడిగితే.. అడిగిందే తడవుగా చంద్రబాబుతోనూ.. రవాణ శాఖ మంత్రితోనూ మాట్లాడి వెంటనే బస్ వేయించారు. ఇది మంచిదే.
కానీ ఆ బస్సును పవన్ కళ్యాణ్ ప్రారంభించిన తీరే వివాదానికి.. చర్చకు దారి తీసింది. సహజంగా కొత్త రూట్లో బస్సులు ఏదైనా ప్రారంభిస్తే.. అయితే స్టార్టింగ్ పాయింట్.. లేదా ఎండింగ్ పాయింట్లో ప్రారంభిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన ఇంటి వద్దకు బస్సును పిలుపించుకుని మంగళగిరిలోని తన క్యాంప్ ఆఫీసు నుంచి తిరుపతి-పళని బస్సును ప్రారంభించారు. దీంతో ఇదెక్కడి పద్దతంటూ పరిపాలన వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అసలు ఇలా చేయడం పద్దతేనా అనేది పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి.. లేదా ఇలా చేయడం కరెక్ట్ కాదని.. అధికారులు చెప్పాలి.. అదీ కాదంటే చంద్రబాబు అయినా ఏదోక సందర్భంలో పవన్ కళ్యాణుకు దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు. అలా కాకుండా.. పద్దతులకు.. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు. అదీ కాకుండా.. దీన్ని చూసి మిగిలిన మంత్రులు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తే వ్యవహరం గాడి తప్పుందనే విషయాన్ని పవన్ కళ్యాణుకు అర్థమయ్యేలా చెప్పాలి కదా అనే చర్చ జరుగుతోంది.
అయితే ఇదే తరహ వ్యవహరాలు గతంలో పవన్ కళ్యాణ్ చేయబోతే.. వాటిల్లో కొన్నింటిని అడ్డుకుంటూనే ఉన్నారట. కడప జిల్లాలో ఎంపీడీఓపై దాడి జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులపై దాడులు జరగ్గకుండా చూడాలి.. దీనికి సంబంధించి కలెక్టర్లకు.. ఎస్పీలకు దిశానిర్దేశం చేద్దామని.. పవన్ కళ్యాణ్ ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుందామని భావించారట. దీనికి హోం మంత్రి కూడా హజరయ్యేందుకు సమాయత్తమయ్యారట. అయితే ఈ విషయం చివరి నిమిషంలో సీఎంఓకు తెలియడంతో ఇలా డెప్యూటీ సీఎం.. అదీ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం సరికాదని సున్నితంగా చెప్పి.. ఆ వీడియో కాన్ఫరెన్సును అతి కష్టమ్మీద ఆపించారట. ఇలా పవన్ కళ్యాణ్ వైపు నుంచి జరుగుతున్న కొన్ని పొరపాట్లను.. తప్పిదాలను తప్పించే ప్రయత్నం చేస్తున్నామని సీఎంఓ చేస్తూనే ఉందట. అయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేయగలమంటూ ప్రభుత్వ పెద్దలు కూడా నిట్టూర్చడం మినహా ఏం చేయలేకపోతున్నట్టుగానే కన్పిస్తోంది.
మొత్తమ్మీద.. పవన్ కళ్యాణ్ వ్యవహరం కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారింది. దీంతో వివిధ సందర్భాల్లో పవన్ ఎలా డీల్ చేయాలో తెలియక.. కొన్నింటిని చూసీ చూడనట్టు సీఎం కూడా వదిలేస్తున్నారని అంటున్నారు.