మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఓటమితో ఇండియా కూటమి పార్టీలు కొత్త ఎత్తుగడ వేసినట్టుగా కనిపిస్తోంది. ఎవరికి వారుగా పోటీ చేసి… ఎన్నికల తర్వాత అవసరమైతే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లోపాయికారిగా అంగీకారానికి వచ్చినట్టు ఢిల్లీలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఈ నిర్ణయం ఇండి కూటమికి షాక్ అనే చెప్పాలి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ పొత్తుకు నిరాకరించి ఒంటరిగానే బరిలోకి దిగింది. ఇక హర్యానాలో కూడా చర్చలు విఫలం కావడంతో ఇరు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుల కోసం సంప్రదింపులు జరపాలని… పొత్తులు కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆప్ కూడా ఒంటరిపోరుకు సిద్ధమని ప్రకటన చేసేసింది. అయితే ఇలా విడివిడిగా పోటీ చేయడం ఇప్పుడు ఎవరికి లబ్ధి చేకూరుస్తుందనేది ఆసక్తిగా మారింది.
అయితే అనుభవాలు పరిశీలిస్తే చేతు గుర్తు – చీపురు గుర్తు మధ్య సఖ్యత ఉన్నట్టు కనిపించటం లేదు. ఇద్దరి ఉమ్మడి శత్రువు కమలాన్ని మట్టి కరిపిద్దామని బలమైన ఆశయం ఉన్నా.. ఆచరణలో సాధ్యం కావటం లేదు.