పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. బైసారన్ వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. 2019 పుల్వామా దాడి తర్వాత భారత్ ఎదుర్కొన్న మరో అత్యంత దారుణ ఘటనగా ఈ దాడిని గుర్తించారు. దీనికి ప్రతీకారం తీర్చుకునే దిశగా భారత ప్రభుత్వం తక్షణమే కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి మోదీ సైనిక, రక్షణ శాఖల అధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మే 4వ తేదీన రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధానమంత్రి నివాసానికి వెళ్లి మోదీతో భేటీ అయ్యారు. అప్పటికే నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో ప్రధాని సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ భేటీల్లో ప్రధానమంత్రి మోదీ రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సమయం, లక్ష్యం నిర్ణయించుకోవడం దళాల పరిమితిలో ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద జాడలను నామ రూపాల్లేకుండా చేసే చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచించారు. ఈ పరిామాలతో పాకిస్తాన్‌లో గుబులు మొదలైంది. ఎల్‌ఓసి వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం పలుమార్లు ఉల్లంఘించగా, భారత సైన్యం కౌంటర్ దాడులతో తగిన బుద్ధి చెబుతోంది. పాక్ హడావిడి చర్యలతో అరేబియా సముద్రంలో భారత నౌకాదళం యుద్ధ నౌకల నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాయుసేన కూడా సన్నద్ధంగా ఉందని, తాము చేపట్టే చర్యలపై పూర్తి క్లారిటీ తీసుకున్నట్లు సమాచారం.
పహల్గామ్ దాడి జరిగిన వెంటనే జరిగిన సీసీఎస్ సమావేశంలోనే భారత్ పాకిస్తాన్‌పై కీలక చర్యలు ప్రారంభించింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ వీసాలను నిలిపివేయడం, భారత్‌లో ఉన్న పాకిస్తానీ పౌరులను వెంటనే వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలు తీసుకుంది. పాక్ హైకమిషన్ సిబ్బందిని తగ్గించాలని సూచించింది. అంతేగాక, పాకిస్తాన్ జెండా ఎగురుతున్న నౌకలకు భారత పోర్టుల్లోకి ప్రవేశం నిషేధించింది. పాక్ విమానాలకు గగనతల ప్రవేశాన్ని అడ్డుకుంది. మరింతగా, పాకిస్తాన్ నుంచి జరిగే దిగుమతులన్నిటిని పూర్తిగా నిషేధించడంతో దాయాది దేశం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటోంది. అంతర్జాతీయంగా అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్‌కు మద్దతు తెలపడంతో, పాకిస్తాన్ ఒంటరిగానే మిగిలే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.