28.2 C
Hyderabad
Friday, September 18, 2026

Live Video

spot_img

నియోజకవర్గానికో వంద పడకల ఆసుపత్రి

పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో వర్చువల్ వైద్య సేవలు

వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 పడకల నుంచి 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కార్యాచరణను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే సుమారు 70 నియోజక వర్గాల్లో 100 పడకలకు మించి ఆస్పత్రులు ఉన్నాయి. మిగిలిన 105 నియోజకవర్గాల్లో ఆసుపత్రుల నిర్మాణం చేపట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

పీపీపీ – పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో ఆసుపత్రులను నిర్మించి, నిర్వహించేందుకు ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమలకు ఇచ్చే విధంగా వీరికి కూడా సబ్సిడీలు ఇవ్వడానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని చంద్రబాబు సూచించారు. సచివాలయంలో జరిగిన ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో సీఎం ఈ విషయాలు ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యమన్నారు.

అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా వేగంగా ముందుకు వెళ్లాలని, వైద్యానికి ప్రపంచ దేశాల నుండి అమరావతికి వచ్చేందుకు అనువైన విధంగా అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

విద్య, వైద్య రంగాలను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తున్న ముఖ్యమంత్రి… గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని పరిస్థితుల్లో రోగులకు వర్చువల్ మాధ్యమంలో ప్రాథమిక వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. రోగం వచ్చిన తర్వాత చికిత్స చేయడం కన్నా ముందే జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని చంద్రబాబు ఉటంకించారు.

ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల ద్వారా హైపర్‌టెన్షన్, డయాబెటిస్ లాంటి జీవన శైలి సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియపైనా సీఎం సమీక్షించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com