గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో సినీ ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ దాడులు గురువారం అర్ధరాత్రితో ముగిసాయి. 55 బృందాలు మూడు రోజుల పాటు 16 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా పుష్ప-2 సినిమాతో పాటు సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాల నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్ళపై విస్తృత సోదాలు చేపట్టారు ఐటీ అధికారులు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలని టార్గెట్‌గా చేసుకుని ఈ సోదాలు నిర్వహించనట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 5వ తేదన విడుదలైన పుష్ప-2 దేశ వ్యాప్తంగా 1850 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించినట్లు ఆ సినిమాకు సంబంధించిన నిర్మాతలే ప్రచారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 నిర్మాతలైన మైత్రీ మూవీస్ అధినేతలు యర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్‌లతో పాటు డైరెక్టర్ సుకుమార్‌ల ఇళ్ళు, కార్యాలయాలు, బంధువుల నివాసాలపై ఐటీ సోదాలు నిర్వహించారు. అలాగే గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్షితారెడ్డిల ఇళ్లపై కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి నివాసంలో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వీరితో పాటు ప్రముఖ కంటెట్ డెవలపర్ సంస్ధ మ్యాంగో టీవీపై కూడా ఐటీ దాడులు జరిగాయి. అలాగే సినీ ఫైనాన్షియర్లు సత్య రంగయ్య, నెక్కంటి శ్రీధర్, నెల్లూరు ప్రతాపరెడ్డి తదితరుల ఇళ్ళు, కార్యాలయాలపై కూడా ఈ మూడు రోజులు విస్తృతమైన సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఈ సోదాల్లో భారీగా నిధులు గోల్మాల్ జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.