ఒక కార్ల షోరూమ్‌లో అగ్నిప్రమాదం సంభవించి షోరూమ్‌లో ఉన్న కార్లన్నీ దగ్గమైన సంఘటన హైదరాబాద్ నగరంలోకి కొండాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కొండాపూర్ చౌరస్తాలో ఉన్న మహేంద్రా షోరూమ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో షోరూమ్‌లో ఉన్న మొత్తం కార్లుతో పాటు షోరూమ్ కూడా పూర్తిగా దగ్గమయ్యింది. మహేంద్రా షోరూమ్‌లో 10 నుంచి 12 కొత్త కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మహేంద్రా కార్ల యాక్ససరీస్ స్పేర్ పార్ట్స్ స్టోర్ కూడా అదే షోరూమ్ ప్రాంగణంలో ఉంది. కార్లు, స్పేర్ పార్టులు కూడా అగ్నికి ఆహుతవుతుండటంతో షోరూమ్ నుంచి దట్టమైన పొగ వెలువడి ఆ పరిసరాలంతటా నల్లటి పొగ వ్యాపించింది. మంటలను ఆర్పడానికి నాలుగు ఫైరింజన్లు వచ్చాయి. ఫైర్ సిబ్బంది దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు ఆరు కోట్ల రూపాలయ ఆస్తి బుగ్గిపాలయ్యిందని షోరూమ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షోరూమ్ అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఉండటంతో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అయ్యింది.