- లోకేష్‌కి పదవి విషయంలో ఎవరూ మాట్లాడవద్దని ఆదేశం
- ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో కూటమి పార్టీల అధ్యక్షులు మాట్లాతారు
నారా లోకేష్‌కి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పార్టీలో ఎవరూ ఇక ముందు మాట్లాడవద్దని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించింది. లోకేష్‌ను డిప్యూటీ సియం చేయాలని ప్రచారం ఆపాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హైకమాండ్ తేల్చి చెప్పింది. అనవసరమైన అంశాలను మీడియా ముందు ప్రస్తావించవద్దని ఆదేశించింది. ప్రభుత్వ పరంగా ఏఅంశం మీదైనా కూటమి పక్షాల అధినేతలు మాట్లాడతారని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీపై రుద్దద్దని హితవు పలికారు. ఈమేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నేతలందరికీ సమాచారం పంపించారు. గడచిన రెండు వారాలుగా నారాలోకేష్కి ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రిని చెయ్యాలని టీడీపీలో పదవులు లేని రాజకీయ నాయకులందరూ మైకుల ముందుకు వచ్చి డిమాండ్ చెయ్యడం ప్రారంభించారు. పార్టీలో అక్కడక్కడ ఛోటామోటా లీడర్లు ఇంటర్నల్‌గా లోకేష్ కి డిప్యూటీ సీయం ఇవ్వాలని అడపాదడపా మాట్లాడినా అది పెద్దగా బహిరంగం కాలేదు. కానీ ఇటీవల టీడీపీ నేత మహాసేన రాజేష్ లోకేష్‌కి డిప్యూటీ సీయం పదవి ఇవ్వాలని తన యూ ట్యూబ్ ఛానల్ వేదికగా డిమాండ్ చేశారు. ఆ తరువాత మొన్న ఎన్టీఆర్ వర్ధంతి రోజు కపడ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసరెడ్డి చంద్రబాబు సమక్షంలో లోకేష్‌కి డిప్యూటీ సీయం ఇవ్వాలనే ప్రస్తావన తెచ్చారు. ఇక వరుసగా అనేక మంది ఛోటామోటా నాయకులు ఈ డిమాండ్‌కు ఊపిరిలూదారు. అందులో ప్రధానంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఓ టీవీ ఛానల్ చర్చలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ కూడా లోకేష్ కన్నా అర్హులు ఎవ్వరూ లేరని, భవిష్యత్తులో పార్టీ నడపాల్సింది ఆయనే అని అందుకని డిప్యూటీ సీయం లోకేష్‌కి ఇవ్వాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఇక రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ అయితే లోకేష్ డిప్యూటీ సీయం మాత్రమే కాదు సీయం కూడా అవ్వాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్లు అంటూనే పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తానని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని ముక్తాయింపు ఇచ్చారు. అయితే టీడీపీ వైపు నుంచి లోకేష్‌కి డిప్యూటీ సీయం ఇవ్వాలని వస్తు్న్న డిమాండ్లు చూసి జనసేన క్యాడర్ వారం రోజులుగా సోషల్ మీడియాలో శివాలెత్తిపోతున్నారు. లోకేష్‌ని డిప్యూటీ సియంని చేసి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిని చేస్తే మాకేమీ అభ్యంతరం లేదని కౌంటర్ ఆర్గ్యుమెంట్ తెరపైకి తెస్తున్నారు. ఒకరిద్దరి హార్డ్‌కోర్ పవన్ ఫ్యాన్స్ ఒకడుగు ముందుకు వేసి చంద్రబాబుకి వయసు మీద పడింది కాబట్టి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిని చెయ్యాలని సెల్ఫీ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీనికి టీడీపీ క్యాడర్ కూడా కౌంటర్ ఇస్తుండటంతో సోషల్ మీడియాలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పరుషపదజాలాలతో మాటల యుద్దాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ఆదిలోనే కంట్రోల్ చెయ్యకపోతే ఇది ఎక్కడికో వెళ్ళి ఏవేవో పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆందోళన చెంది. ఇకపై ఎవరూ ఈ విషయం మాట్లాడవద్దని ఇటువంటి ప్రచారాలకు పులిస్టాప్ పెట్టింది టీడీపీ అధిష్టానం.